భోగాపురం ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
- భూ రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పులు - August 1, 2026
- విద్వేష ప్రసంగాలు, హేట్ క్రైమ్స్‌కు చెక్.. - August 1, 2026
- పోలీస్ నియామకాలకు ఆగస్టు 19 నుంచి దరఖాస్తులు - August 1, 2026

- రూ.18 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- ఉత్తరాంధ్ర అభివృద్ధికి అల్లూరి ఎయిర్‌పోర్టు రన్‌వే అవుతుందన్న ప్రధాని
- కొత్త చరిత్రకు నాంది పలికిందన్న సీఎం చంద్రబాబు
- దేశానికి మోదీ నాయకత్వమే శ్రీరామరక్ష అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- కోస్టల్ ఎకనామిక్ కారిడర్గా ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబాటు
జ్ఞాన తెలంగాణ, భోగాపురం ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. భోగాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, పవిత్రమైన సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు లభించే ఉత్తరాంధ్ర నేలపై అడుగుపెట్టడం తన అదృష్టమని అన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో పాటు ఒకేసారి 13 వేల మంది గిరిజనులు థింసా నృత్యం చేయడం రెండు చారిత్రక ఘట్టాలుగా నిలిచాయని పేర్కొన్నారు. థింసా నృత్యంలో గిరిజనుల సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించిందని కొనియాడారు.
అభివృద్ధికి రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు కీలకమని పేర్కొన్న ప్రధాని, కనెక్టివిటీ పెరిగితే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు సహజంగానే విస్తరిస్తాయని చెప్పారు. గతంలో విమానాశ్రయాలకు ఒకే కుటుంబానికి చెందిన పేర్లు పెట్టేవారని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి, పంజాబ్‌లో సంత్ రవిదాస్, భోగాపురం విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిందని గుర్తు చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన అల్లూరి స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని అన్నారు.

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వేగా, రాష్ట్ర యువత భవిష్యత్తుకు కొత్త లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశ విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని, 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రెండింతల వేగంతో అభివృద్ధి సాధిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడర్గా అభివృద్ధి చేస్తూ జాతీయ పారిశ్రామిక కారిడర్లతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. పీఎం గతిశక్తి పథకం ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని, డేటా సెంటర్లు, ఫార్మా, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందన్నారు. ఈ విమానాశ్రయంతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమై వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గి ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. గూగుల్, స్టీల్ కంపెనీలతో పాటు అనేక పరిశ్రమలు ఉత్తరాంధ్ర వైపు వస్తున్నాయని చెప్పారు.

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధాని మోదీ అండగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిశ్రమ, అమరావతి రాజధానికి కేంద్రం మద్దతు అందించిందన్నారు. గత రెండేళ్లలో ఉత్తరాంధ్రలో 150కి పైగా ప్రాజెక్టులు ప్రారంభించామని, అవన్నీ పూర్తయితే సుమారు మూడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రూ.2,784 కోట్లతో ఎనిమిది ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, 2027 నాటికి పోలవరం, అమరావతి తొలి దశ నిర్మాణాలను పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలోనే 2047 వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా, మౌలిక సదుపాయాల విస్తరణ, అవినీతి రహిత పాలన, గ్రీన్ ఎనర్జీ, ఉగ్రవాద నిర్మూలన వంటి రంగాల్లో మోదీ నాయకత్వం దేశాన్ని ముందుకు నడిపిస్తోందన్నారు. తన రాజకీయ జీవితంలో “నేషన్ ఫస్ట్” భావజాలంతో పనిచేస్తున్న నాయకుడిగా మోదీని చూస్తున్నానని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, దేశాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. దేశం కోసం కష్టపడే నాయకుడికి అదేనా గౌరవమని ప్రశ్నించారు. జంతర్ మంతర్ వద్ద తనపై విమర్శలు చేసిన వారినీ క్షమించిన పెద్దమనసు మోదీదేనని పేర్కొన్నారు. దేశాన్ని నడిపించడం రామకార్యంతో సమానమని, సెలవులు లేకుండా పనిచేస్తున్న ప్రధానికి దేశ ప్రజల మద్దతు అవసరమన్నారు.
మోదీ స్వచ్ఛందంగా తప్పుకుంటే తప్ప దేశ నాయకత్వం ఆయన చేతుల్లోనే కొనసాగాలని తాము కోరుకుంటున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. మోదీని మించిన నాయకుడు మరొకరు లేరని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఆయన దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. కూటమి ఏర్పాటుకు తాను చేసిన ప్రయత్నాల ఫలితమే నేడు కనిపిస్తోందని, భోగాపురం విమానాశ్రయం అందుకు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలకు తగిన విధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన ద్వారాలను తెరుస్తుందని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంత ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
