గణనాథునికి మొక్కు చెల్లించిన గిర్మాపూర్ యువకులు
- గణనాథునికి మొక్కు చెల్లించిన గిర్మాపూర్ యువకులు - September 22, 2026

కొండాపూర్,సెప్టెంబర్ 22:
కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన విఘ్నేశ్వరుడికి గ్రామ యువకులు భక్తి పారవశ్యంతో మొక్కు చెల్లించుకున్నారు. మధ్యరంగం గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలతో పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్న వేళ యువకులు చేపట్టిన పాదయాత్ర భక్తులకు ఆకట్టుకుంది.
మంగళవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చెందిన తొమ్మిది మంది యువకులు 17 కిలోమీటర్ల మేర భక్తి పాదయాత్రను ప్రారంభించారు. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన పాదయాత్ర అనంతరం ఆలయానికి చేరుకుని విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మొక్కు చెల్లించుకుని గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మండల కురుమ గొల్ల సంఘం అధ్యక్షుడు గొల్ల రామ్ మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు గ్రామ ప్రజలపై తన ఆశీస్సులు కురిపించాలని ఆకాంక్షించారు. గణపతి నవరాత్రులు గ్రామంలో ఐక్యత, భక్తి భావాన్ని మరింత పెంచాయని తెలిపారు. గణనాథుని కృపతో గ్రామంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, యువతకు మంచి భవిష్యత్తు కలగాలని, రైతులు, కూలీలు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. భక్తితో చేసిన ఈ పాదయాత్ర తమకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.
ఈ భక్తి పాదయాత్రలో గొల్ల రామ్, పట్లోళ్ల కమలాకర్, పట్లోళ్ల సతీష్, పట్లోళ్ల వినోద్, పట్లోళ్ల శివ, గొల్ల హరీష్, గొల్ల ఆకాష్, తార బబ్బు, తార చింటూ పాల్గొన్నారు.
