విద్యార్థిని చంద్రకళ మృతికి న్యాయం చేయాలి – కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలి
- ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడల నిర్వహణకు కీలక నిర్ణయాలు - November 4, 2026
- కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతంపై కఠిన చర్యలు తీసుకోవాలి. - November 4, 2026
- నవంబర్ 6న కామారెడ్డిలో శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు - November 4, 2026
కామారెడ్డి: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో చదువుతున్న ఎస్సీ దక్కలి సామాజిక వర్గానికి చెందిన మొదటి తరం విద్యార్థిని చంద్రకళ మృతి ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పక్షాన డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట రాములు మాట్లాడారు. అట్టడుగు సామాజిక వర్గం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన చంద్రకళ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, దక్కలి సామాజిక వర్గానికి కూడా తీవ్ర నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రకళ మృతికి కారణమైన వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి సత్తిగారి లక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బాణాపురం లావణ్య, మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
