భారత్–రష్యా బంధం అజేయం!
- ఆసియా విద్యారంగంలో ఐఐటీ హైదరాబాద్ దూకుడు.. - November 4, 2026
- న్యాయశాఖలో బదిలీల కలకలం.. 24 మంది జడ్జీలకు స్థానచలనం - November 4, 2026
- పార్ట్‌టైమ్ లెక్చరర్ల పిటిషన్ కొట్టివేత - November 4, 2026

జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: భారత్–రష్యా మధ్య కొనసాగుతున్న స్నేహ సంబంధాలను ప్రపంచంలోని ఏ బయటి శక్తీ విచ్ఛిన్నం చేయలేదని రష్యా స్పష్టం చేసింది. అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతున్నా, ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహబంధం మరింత బలంగా నిలుస్తోందని పేర్కొంది. ఈ సంబంధాలు కేవలం ప్రభుత్వాల మధ్య కుదిరిన దౌత్య ఒప్పందాలకే పరిమితం కాలేదని, శతాబ్దాలుగా ప్రజల మధ్య ఏర్పడిన సాంస్కృతిక, భావోద్వేగ అనుబంధాలపై ఆధారపడి ఉన్నాయని రష్యా రాయబార కార్యాలయ ప్రతినిధి పెట్ర్ సిజోవ్ వెల్లడించారు. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో నిర్వహించిన రష్యన్ సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్–రష్యా మధ్య ఉన్న చారిత్రక అనుబంధానికి మహాత్మా గాంధీ, ప్రముఖ రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ మధ్య జరిగిన లేఖల మార్పిడిని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. గాంధీజీ టాల్‌స్టాయ్‌ను తన గురువుగా భావించేవారని, ఇద్దరూ ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా లేఖల ద్వారా ఆలోచనలు పంచుకున్నారని గుర్తుచేశారు. ఈ అనుబంధం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రష్యాలో భారతీయ సినిమాలకు, భారత్‌లో రష్యన్ బ్యాలెట్ నృత్యానికి లభిస్తున్న ఆదరణ సాంస్కృతిక మార్పిడికి నిదర్శనమని చెప్పారు. భారత్–రష్యా దౌత్య సంబంధాలకు 80 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సంగీత, కళా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు.
ఇదే కార్యక్రమంలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సతీమణి డయానా అలిపోవా మాట్లాడుతూ, అధికారిక దౌత్య సంబంధాల కంటే సాంస్కృతిక దౌత్యం ప్రజలకు మరింత చేరువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష కళా ప్రదర్శనల ద్వారా భారతీయ యువతకు రష్యా సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం దిల్లీలోని పాఠశాలలతో కలిసి పనిచేస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా తీవ్రస్థాయిలో దాడులు కొనసాగించడంతో యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. సోమవారం రాత్రి ఉక్రెయిన్‌లోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడినట్లు అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. ఈ దాడుల్లో 29 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు సమాచారం. రష్యా 89 డ్రోన్లు, 17 బాలిస్టిక్ క్షిపణులు, 59 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఆయన తెలిపారు. విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్లు సహా ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడంతో పలు నగరాలు, ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఖార్కివ్‌లోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో 73 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నిరంతర సహకారం అందించాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యా దాడుల ముప్పును వాషింగ్టన్ విస్మరించరాదని, విశ్వసనీయమైన ప్రక్రియ ద్వారా శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. భారత్–రష్యా మధ్య స్నేహబంధం బలంగా కొనసాగుతుండగా, మరోవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది
