ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడల నిర్వహణకు కీలక నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడలను విజయవంతం చేసేందుకు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని ఒలింపిక్ అసోసియేషన్ భవనంలో అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారులు, మాజీ ఎంపీ ఎ.పి. జితేందర్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, కమిటీ కన్వీనర్ బండ ప్రకాష్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డితో పాటు అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ఈ జాతీయ క్రీడలను హైదరాబాద్‌తో పాటు హనుమకొండ, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ నగరాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 28 క్రీడాంశాల్లో జరిగే పోటీలకు దేశవ్యాప్తంగా 7 వేల మందికి పైగా క్రీడాకారులు, విద్యార్థులు, కోచ్‌లు హాజరుకానున్నారు. వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం కమిటీ సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి క్రీడల నిర్వహణపై సూచనలు, సలహాలు స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ మెగా క్రీడా సంబరాలను విజయవంతం చేసి జాతీయ స్థాయిలో తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకురావాలని కమిటీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులకు మరపురాని అనుభూతిని అందిస్తామని అడ్వైజరీ కమిటీ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.

You may also like...