ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ కొరడా!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో హాజరు నిర్వహణ విషయంలో నిర్లక్ష్యానికి ఇక తావులేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎస్ఎంఎస్) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సబీనీ నికోలస్ ఆదేశించారు. పాఠశాలల యాజమాన్యాలు హాజరు వివరాల నమోదును తేలికగా తీసుకోవడం, సమాచారాన్ని సకాలంలో అప్‌లోడ్ చేయడంలో అలసత్వం ప్రదర్శించడం సరికాదని ఈ ఆదేశాల సారాంశం స్పష్టం చేస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను కేంద్ర విద్యాశాఖ తరచూ కోరుతున్న నేపథ్యంలో రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని సూచించారు. పాఠశాలల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రతి వివరాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులకు స్పష్టమైన సమాచారం అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎస్ఏ-1 పరీక్షల ఫలితాలకు సంబంధించిన ప్రగతి పత్రాలను వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పించింది. దీంతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, పరీక్షల ఫలితాలు, విద్యా పురోగతిని తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

You may also like...