డ్రగ్స్‌పై యుద్ధం.. డెడ్‌లైన్ ఖరారు!
- భూ రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు! - November 10, 2026
- కరవు కోరల్లో రైతులు.. - November 10, 2026
- బీసీ ర్యాలీకి రాహుల్‌కు ఆహ్వానం! - November 10, 2026

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి:
దేశ యువత భవిష్యత్తును మత్తు పదార్థాల ఊబిలోకి నెట్టేస్తున్న మాదకద్రవ్యాల మాఫియాపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 2028 డిసెంబర్ 31 నాటికి గుజరాత్‌ను పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 2029 డిసెంబర్ 31 నాటికి ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ సాధించాలన్న సంకల్పాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, తాను గుజరాత్‌కు చెందినవారమని, అందుకే దేశ లక్ష్యానికి ఏడాది ముందే గుజరాత్ ఈ ఘనత సాధించాలని పిలుపునిచ్చారు.
అహ్మదాబాద్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులను అమిత్ షా ప్రారంభించారు. ఇస్కాన్-సనంద్ ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు పలు గృహ నిర్మాణ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ, నక్సలిజాన్ని అణచివేసిన తర్వాత దేశం ముందున్న మరో కీలక సవాలు మాదకద్రవ్యాల నిర్మూలనేనని పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యాపారం కేవలం యువత జీవితాలను నాశనం చేయడమే కాకుండా, దేశ భద్రతకు కూడా పెను ముప్పుగా పరిణమిస్తోందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల విక్రయాల ద్వారా సమకూరే నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేసేందుకు డిసెంబర్ 1 నుంచి 1033 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రజలు ఈ నంబర్‌కు సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడంతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
డ్రగ్స్ మహమ్మారిని కేవలం పోలీసు చర్యలతోనే అంతం చేయలేమని, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని అమిత్ షా స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల బారినపడిన వారిని నేరస్థులుగా చూడకుండా, చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాధితుల గోప్యతకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న డ్రగ్స్ మాఫియాకు అడ్డుకట్ట వేయడం ఇప్పుడు దేశం ముందున్న అత్యవసర కర్తవ్యం. ప్రభుత్వ లక్ష్యాలు ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినంగా అమలైతేనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది.
