నకిలీ పత్రాలతో ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.30 లక్షల టోకరా!
- హైదరాబాద్ సీపీగా ఇక సెలవు! - November 12, 2026
- పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి - November 12, 2026
- మీర్పేట్లో మహిళ దారుణ హత్య - November 12, 2026

రంగారెడ్డి జిల్లా:
ఉద్యోగం లేదు.. బ్యాంకు ఖాతా లేదు.. స్థిరమైన ఆదాయం కూడా లేదు.. అయినప్పటికీ లక్షల్లో జీతం పొందుతున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఏకంగా రూ.30 లక్షల రుణం కాజేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో ప్రైవేటు బ్యాంకును బురిడీ కొట్టించిన ఈ మోసం స్థానికంగా కలకలం రేపింది. రుణం పొందేందుకు నిందితులు పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
వివరాల్లోకి వెళితే.. ఎలాంటి ఉద్యోగం లేకపోయినా ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నట్లు నమ్మించేందుకు నిందితులు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, శాలరీ స్లిప్పులు తయారు చేశారు. నెలకు లక్షల రూపాయల జీతం వస్తున్నట్లు పత్రాల్లో చూపించారు. అంతటితో ఆగకుండా నకిలీ ఆధార్, పాన్ కార్డులను కూడా సృష్టించి ఐసీఐసీఐ బ్యాంకుకు సమర్పించారు. ఆదాయం, ఉద్యోగం, వ్యక్తిగత గుర్తింపు వివరాలు నిజమైనవేనని నమ్మించేలా పత్రాలను రూపొందించి బ్యాంకు నుంచి రూ.30 లక్షల రుణం పొందినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ఐదుగురు ఏజెంట్ల సహకారం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నకిలీ పత్రాల తయారీ నుంచి రుణ దరఖాస్తు ప్రక్రియ వరకు వీరి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మోసం వెనుక మరెవరైనా ఉన్నారా? నకిలీ పత్రాలను ఎక్కడ తయారు చేశారు? రుణం పొందిన సొమ్మును ఎక్కడికి మళ్లించారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
మరోవైపు సరైన పత్రాలు లేకుండానే రూ.30 లక్షల రుణం ఎలా మంజూరైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దరఖాస్తుదారుడి ఉద్యోగ వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను బ్యాంకు అధికారులు సక్రమంగా పరిశీలించారా? లేక నిందితులతో కుమ్మక్కై రుణం మంజూరు చేశారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ముఠా ఇదే తరహాలో ఇతర బ్యాంకులను కూడా మోసం చేసిందా? మరిన్ని నకిలీ రుణాలు పొందిందా? అన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో పత్రాల ధ్రువీకరణ ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.
