దళితులపై దాష్టీకం ఇక చెల్లదు

  • 80 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాతా వివక్ష కొనసాగడంపై భట్టి ఆగ్రహం
  • అంటరానితనం, అట్రాసిటీలకు చరమగీతం పాడాలని డిమాండ్
  • ఖర్గే వేదిక శుద్ధి ఘటనపై తీవ్ర అభ్యంతరం
  • మనువాద భావజాలంపై విరుచుకుపడ్డ అద్దంకి దయాకర్
  • సమానత్వం, ఆత్మగౌరవం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపు

జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నా దళితులు, ఆదివాసీలపై వివక్ష, అవమానాలు, దాడులు కొనసాగడం దురదృష్టకరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆత్మగౌరవం, హక్కులు, సమానత్వం కోసం దళితులు, ఆదివాసీలు ఐక్యంగా నిలబడి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన దళిత–ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వివక్ష, హింస, సామాజిక అవమానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించడమే సమావేశం ఉద్దేశమని కాంగ్రెస్ ప్రకటించింది.

అంటరానితనానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో తీర్మానాలు జరిగిన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. అనంతరం దళితుల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం వంటి చట్టపరమైన రక్షణలు అందుబాటులోకి వచ్చినప్పటికీ సామాజిక వివక్ష పూర్తిగా అంతం కాకపోవడం బాధాకరమన్నారు. మనుధర్మ శాస్త్రం పేరుతో వెనుకబడిన వర్గాలపై వివక్షను ప్రోత్సహించే ధోరణులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం, రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను కులం, మతం పేరుతో కాలరాయడానికి ఎవరినీ అనుమతించకూడదన్నారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ సభా ప్రాంగణంలో అనంతరం ‘శుద్ధీకరణ’ కార్యక్రమం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. అంచెలంచెలుగా ఎదిగి సీఎల్పీ నేతగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి నాయకుడు పాల్గొన్న వేదికను అనంతరం శుద్ధి చేయడం అవమానకరమైన చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, బీజేపీ నేతలు తమ పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ అంశంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఢిల్లీలో ఆత్మగౌరవ సమావేశాన్ని నిర్వహించింది.

అద్దంకి దయాకర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా బీజేపీ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సమాజంలో కుల వివక్షను పెంచే మనువాద భావజాలాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం పేరుతో అంటరానితనాన్ని ప్రోత్సహించే చర్యలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్‌లో ఖర్గే సభ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండించకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో గతంలో దళిత కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్దకు వెళ్లిన సమయంలో పసుపు నీళ్లు చల్లిన ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. “ఢిల్లీలో పెద్ద మోదీ.. గల్లీలో చిన్న మోదీ కేసీఆర్” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖర్గేపై జరిగిన అవమానాన్ని రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు.

దళితులు, ఆదివాసీల ఆత్మగౌరవం కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు ఆచరణలోనూ రక్షించబడాలని సమావేశంలో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అంటరానితనం, కుల వివక్ష, సామాజిక వెలివేత, దాడులకు వ్యతిరేకంగా చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ప్రతి పౌరుడికీ అందే వరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరుగుతున్న వివక్ష, హింసకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో పోరాటాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

You may also like...