చిన్న, మధ్యతరహా పత్రికల సమస్యలపై మేధోమథనం

హైదరాబాద్: జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని పత్రికా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, చిన్న, మధ్యతరహా పత్రికల మనుగడ, జర్నలిస్టుల సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణపై జర్నలిస్టులు, సంపాదకులు మేధోమథనం చేశారు.

నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆడిటోరియంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ (TSMNMA) అసోసియేషన్ అధ్యక్షుడు యూసఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి వై.ఎల్. అశోక్‌తో పాటు వివిధ పత్రికల సంపాదకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిన్న, మధ్యతరహా పత్రికలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ముద్రణ ఖర్చులు, ప్రకటనల కొరత, పంపిణీ సమస్యలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల అవసరంపై విస్తృతంగా చర్చించారు. పరిమిత వనరులతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న చిన్న పత్రికలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. పత్రికల అభివృద్ధికి అనుకూలమైన విధానాలు రూపొందించడంతో పాటు సంపాదకులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్రస్థాయి సదస్సులు, పత్రికా రంగ అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, చిన్న పత్రికల బలోపేతం కోసం సంఘటితంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో TUWJ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి రాములు, ఉర్దూ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మాజిద్, ప్రధాన కార్యదర్శి గౌస్, కిరణ్ కుమార్, TSMNMA అధ్యక్షుడు యూసఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి వై.ఎల్. అశోక్ తదితర జర్నలిస్టు సంఘాల నాయకులు, వివిధ పత్రికల సంపాదకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

You may also like...