కీసర పోలీస్‌స్టేషన్‌లో భారీ బదిలీలు

మేడ్చల్ : కీసర పోలీస్‌స్టేషన్‌లో ఉన్నతాధికారులు భారీ స్థాయిలో శాఖాపరమైన మార్పులు చేపట్టారు. ఎస్‌ఐ నాగరాజుతో పాటు మరో 10 మంది కానిస్టేబుళ్లను సౌత్‌జోన్‌కు బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే పోలీస్‌స్టేషన్‌లో వరుసగా అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు వెలుగులోకి రావడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశంగా మారింది.

నెల రోజుల క్రితం కీసర పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్‌ఐలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఈ ఘటన మరువకముందే నాలుగు రోజుల క్రితం ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కూడా ఏసీబీకి పట్టుబడ్డారు. వరుసగా పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం, ఏసీబీ చర్యలు చోటుచేసుకోవడంతో ఉన్నతాధికారులు శాఖాపరమైన ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎస్‌ఐ నాగరాజుతో పాటు 10 మంది కానిస్టేబుళ్లను సౌత్‌జోన్‌కు బదిలీ చేశారు. ఈ పరిణామం స్థానిక పోలీసు వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరోవైపు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కీలక సెక్టార్లకు కొత్త ఎస్‌ఐలను నియమించారు. కీసర సెక్టార్‌కు వెంకట్‌రెడ్డి, నాగారం సెక్టార్‌కు గౌరేందర్‌గౌడ్, చీర్యాల్ సెక్టార్‌కు ప్రభాకర్‌లను నియమిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ బదిలీలు పోలీస్‌శాఖలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న అధికారులు తమ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్‌శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా పనిచేయాల్సిన బాధ్యత ఉంది.

You may also like...