వైద్య విద్యలో ఐఐటీ ఖరగ్‌పూర్ సరికొత్త చరిత్ర
- బెట్టింగ్ యాప్స్ ముసుగులో చైనా దందా! - November 13, 2026
- రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ ఫ్లాట్! - November 13, 2026
- వామ్మో.. అందం భయం! - November 13, 2026

దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా పేరొందిన ఐఐటీ ఖరగ్‌పూర్ వైద్య విద్యా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తింపుతో ఎండీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించిన తొలి ఐఐటీగా ఘనత సాధించింది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని డాక్టర్ బీసీ రాయ్ మల్టీ స్పెషాలిటీ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో ఆరు విభాగాల్లో మొత్తం 12 సీట్లను కేటాయించారు. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, ఫిజియాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, బయోకెమిస్ట్రీ విభాగాల్లో రెండేసి సీట్ల చొప్పున ప్రవేశాలు కల్పించనున్నారు. నీట్ పీజీ కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. రౌండ్–2 కౌన్సెలింగ్‌లో ఈ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ సైన్స్, అధునాతన పరిశోధనలను వైద్య విద్యతో అనుసంధానించడం ఈ కోర్సుల ప్రధాన ఉద్దేశం. ఏఐ ఆధారిత వైద్య నిర్ధారణ, మెడికల్ ఇమేజింగ్, బయోమెడికల్ పరికరాలు, మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, ప్రెసిషన్ మెడిసిన్ వంటి అత్యాధునిక రంగాల్లో విద్యార్థులకు పరిశోధన అవకాశాలు కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి మాట్లాడుతూ వైద్య నైపుణ్యాన్ని ఇంజనీరింగ్ ప్రతిభతో అనుసంధానించి, అత్యుత్తమ వైద్యులతో పాటు ఆరోగ్య రంగ సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపగల పరిశోధకులను తయారు చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. 1951లో దేశంలోనే తొలి ఐఐటీగా ప్రారంభమైన ఖరగ్‌పూర్ సంస్థ, తాజా నిర్ణయంతో సాంకేతిక విద్యకు, వైద్య పరిశోధనలకు మధ్య కొత్త వారధిని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ పరిణామం దేశ వైద్య విద్యా రంగంలో సరికొత్త అవకాశాలకు మార్గం సుగమం చేయనుంది.
