రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి

  • కుత్బుల్లాపూర్ పరిధిలోనిహెచ్‌ఎం‌టీ సంస్థ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి హెచ్‌ఎం‌టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరై ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దకాలంగా బకాయిల కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారికి రావాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ మొత్తాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్లమెంట్‌లో ప్రస్తావించి ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా హెచ్‌ఎం‌టీకి చెందిన విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా, కబ్జాలకు గురికాకుండా సంస్థ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు జీవీ నారాయణరెడ్డి, రాములు, మధుకృష్ణ, రవీందర్, యాదగిరి, కుమారస్వామి, మహేందర్, మాల్యాద్రితో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

You may also like...