ఓయూకు వెయ్యి కోట్ల హామీ ఏమైంది?..

ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు: డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
జ్ఞాన తెలంగాణ,స్టేట్ డెస్క్ : వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ కనీస హక్కుల కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి నెలకొనడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు, పెన్షన్, పే స్కేల్, గ్రాట్యుటీ వంటి కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో యూనివర్సిటీ ఉండటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వహించిన మహా ధర్నాకు ఆయన హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ తీరును తీవ్రంగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం, వందేళ్ల చరిత్ర కలిగిన విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు కావాలని, పదవీ విరమణ అనంతరం పెన్షన్ అందించాలని, కనీస వేతనాలు, గ్రాట్యుటీ కల్పించాలని పోరాటం చేయడం బాధాకరమన్నారు.



ఇవి విలాసవంతమైన డిమాండ్లు కావని, ఉద్యోగుల ప్రాథమిక హక్కులని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పులు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఉద్యోగులకు న్యాయం చేసే అవకాశం ప్రభుత్వానికి, యూనివర్సిటీ యాజమాన్యానికి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ.వెయ్యి కోట్ల నిధుల హామీని ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. ఆ నిధులు విడుదల చేస్తే ఉద్యోగుల సమస్యల్లో చాలా వరకు పరిష్కారమవుతాయని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి తన సొంత శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని పేర్కొన్నారు. కేవలం రూ.15 వేల వేతనంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. శాశ్వత ఉద్యోగులకు ఒక న్యాయం, కాంట్రాక్టు ఉద్యోగులకు మరో న్యాయం ఉండకూడదన్నారు. వారికి ఓపీఎస్ లేదు, సీపీఎస్ లేదు. భవిష్యత్తుపై భరోసా లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు నిర్మించుకోవడం, పిల్లల పెళ్లిళ్లు చేయడం వంటి కనీస కుటుంబ బాధ్యతలను కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా కింద మరణిస్తే రూ.10 లక్షలు, గాయపడితే రూ.5 లక్షలు అందించే విధానాలు ఉన్నాయని, అదే తరహాలో విశ్వవిద్యాలయ ఉద్యోగులకు భద్రత కల్పించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగులు అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చుల భారం ప్రభుత్వమే భరించాలని, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌ను ఓయూ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ల్యాబ్ అసిస్టెంట్లు, లైబ్రేరియన్లు, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎగ్జామినేషన్ బ్రాంచ్ సిబ్బంది ఎన్నో ఏళ్లుగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. బోధనా సిబ్బంది ఎంత ముఖ్యమో బోధనేతర సిబ్బంది కూడా అంతే ముఖ్యమని, వారి శ్రమను గుర్తించకుండా హక్కులను నిరాకరించడం అన్యాయమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్టిజన్ హోదా కల్పించి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. అదే తరహాలో యూనివర్సిటీ ఉద్యోగులకూ న్యాయం చేయాలని కోరారు. ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసును ప్రస్తావిస్తూ, చట్టపరమైన మార్గాలను పరిశీలించి అర్హులైన ఉద్యోగులకు న్యాయం చేయాలని సూచించారు.

గురుకుల సొసైటీల కార్యదర్శిగా, టీచర్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా పనిచేసిన సమయంలో 17 వేల మంది ఉద్యోగులను గురుకులాల్లో శాశ్వత ఉద్యోగులుగా నియమించిన అనుభవం తనకు ఉందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే మార్గాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. విద్యాశాఖ కార్యదర్శి నుంచి యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు వచ్చిన లేఖలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల వల్లే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని సంఘాలు చెబుతున్నప్పుడు వాటిని సవరించకుండా కాలయాపన చేయడం సమస్యను మరింత జటిలం చేస్తుందని మండిపడ్డారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉద్యోగుల బాధలను అర్థం చేసుకొని, సమస్యలు, పరిష్కార మార్గాలను ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు వారి పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల హక్కులకు భరోసా కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

You may also like...