నిశ్శబ్దంగా విస్తరిస్తున్న మధుమేహం!
- భూ రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు! - November 10, 2026
- కరవు కోరల్లో రైతులు.. - November 10, 2026
- బీసీ ర్యాలీకి రాహుల్కు ఆహ్వానం! - November 10, 2026

జ్ఞాన తెలంగాణ,స్టేట్ బ్యూరో :
మధుమేహం ఇప్పుడు దేశాన్ని లోలోపల కబళిస్తున్న నిశ్శబ్ద ఆరోగ్య విపత్తుగా మారుతోంది. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న లక్షలాది మంది శరీరాల్లో ప్రమాదకరమైన వ్యాధి తిష్టవేసినా, కనీస అవగాహన లేక పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం నవంబర్ 14 నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంతర్జాతీయ సర్వే గణాంకాలు దేశ ప్రజారోగ్య వ్యవస్థకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారతదేశంలో సుమారు 3.86 కోట్ల మంది పెద్దలకు తమకు మధుమేహం ఉందన్న విషయమే తెలియదని సర్వే వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి విస్తరిస్తున్న వేగానికి ప్రజల్లో ఉన్న అప్రమత్తత ఏమాత్రం సరిపోవడం లేదన్నది ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మధుమేహ బాధితుల్లో 43 శాతం మంది ఇప్పటివరకు నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేదని, కేవలం 57 శాతం మందికే వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు సర్వే పేర్కొంది. భారత్తో పాటు మరో ఆరు దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో మన దేశానికి చెందిన 502 మంది పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ముందస్తు పరీక్షలు చేయించుకోవడం మంచిదని 84 శాతం మంది అంగీకరిస్తున్నారు. కానీ తమకు టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నవారు కేవలం 14 శాతం మందే కావడం ప్రజల్లోని నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్రీడయాబెటిస్కు స్పష్టమైన లక్షణాలు ఉంటాయని 75 శాతం మంది తప్పుగా నమ్ముతున్నారు. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చన్న వాస్తవాన్ని గుర్తించకపోవడం ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. ముందస్తు పరీక్షలు ఎలా చేయించుకోవాలో తెలియక 48 శాతం మంది అయోమయంలో ఉన్నారు. భయం, అవగాహన లోపం కూడా పరీక్షలకు అడ్డంకులుగా మారుతున్నాయి.
కుటుంబంలో మధుమేహ చరిత్ర, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, రక్తపోటు వంటి అంశాలు టైప్-2 మధుమేహ ముప్పును పెంచుతాయి. అలసట, చూపు మసకబారడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్యలుగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తున్నారు. అధిక దాహం, తరచూ మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండటం సరికాదు. అప్పటికే వ్యాధి ముదిరే ప్రమాదం ఉంది.
ప్రజలు ఇకనైనా నిర్లక్ష్యపు ముసుగు తొలగించాలి. ఆరోగ్యంపై అజ్ఞానమే అనారోగ్యానికి ప్రధాన ద్వారం కాకూడదు. వైద్యుల సూచనలతో తగిన సమయంలో రక్తంలో చక్కెర పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి బయటపడిన తర్వాత ఆందోళన చెందడం కంటే, ముందుగానే గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యం. మధుమేహంపై అవగాహనను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, వైద్య వ్యవస్థలు, సమాజంపై ఉంది.
