అదనపు జలాల అనుసంధానం పూర్తి చేయాలి ఎండి అశోక్ రెడ్డి ఆదేశం

నవంబర్ 15లోగా గోదావరి అదనపు జలాల అనుసంధాన పనులు పూర్తి చేయాలి

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి అదనపు జలాలను నగరానికి తరలించే పనులను వేగవంతం చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో సింగూరు–మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు ఘన్‌పూర్ వద్ద చేపడుతున్న పైప్‌లైన్ అనుసంధాన పనులను సోమవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, నవంబర్ 15వ తేదీలోగా అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గడువు పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పైప్‌లైన్ నిర్మాణ పనులను రెండు వైపుల నుంచి సమాంతరంగా చేపట్టి త్వరితగతిన అనుసంధానం చేయాలని సూచించారు.

పనులు వేగంగా పూర్తయ్యేందుకు మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు కార్మిక బృందాలను రంగంలోకి దించాలని, రాత్రివేళ అవసరమైన ఫ్లడ్‌లైట్లు, యంత్రాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. పైప్‌లైన్‌కు కీలకమైన రోడ్డు క్రాసింగ్ పనులను వెంటనే ప్రారంభించి రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.

మిషన్ భగీరథ, అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన యంత్రాలు, సాంకేతిక నిపుణులు, సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు. అవసరమైతే ఇతర ప్రాంతాల్లోని గోదావరి ప్రాజెక్టు యంత్రసామగ్రిని కూడా ఈ పనులకు మళ్లించాలన్నారు.

వేసవిలో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించి సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.

You may also like...