హెచ్చరికలు శూన్యం, తవ్వకాలు ఇష్టారాజ్యం, నరకప్రాయంగా ఐటీ రోడ్లు.

389863.jpg

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ : గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అత్యంత రద్దీగా ఉండే కాంటినెంటల్ హాస్పిటల్ నుండి మెయిన్ రోడ్డు వరకు కొన్ని నెలల క్రితం భూగర్భ కేబుల్స్ కోసం తవ్విన గుంతలు ఇప్పటికీ అలాగే దర్శనమిస్తున్నాయి.

పనులు ఎప్పుడో నిలిచిపోయినా రోడ్డును పునరుద్ధరించకపోవడంతో స్థానికులు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతైన గుంతల చుట్టూ ఎలాంటి హెచ్చరిక బోర్డులు (No Signage Boards), బారికేడ్లు లేదా భద్రతా ప్రమాణాలు (Safety Precautions) ఏర్పాటు చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

దీనికితోడు, తవ్విన మట్టి, పెద్ద పెద్ద రాళ్లను పాదాచారులు నడిచే ఫుట్‌పాత్ మీద కూడా వేయడంతో ప్రజలు నడవడానికి వీల్లేకుండా పోయింది. ఫుట్‌పాత్ పూర్తిగా మూసుకుపోవడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రధాన రహదారిపై నుంచే వాహనాల మధ్య నడవాల్సి వస్తోందని పాదాచారులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు, మట్టి కుప్పలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లే రోగులు, అత్యవసర అంబులెన్స్‌ల రాకపోకలకు కూడా ఈ తవ్వకాలు పెద్ద అడ్డంకిగా మారాయి.

ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు తక్షణమే స్పందించి, తగిన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ఈ రోడ్డు పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like...