పోలీసుల చేతిలో చట్టం..విద్యార్థులపై ఖాకీ కర్కశత్వం!


జ్ఞానతెలంగాణ,మహబూబాబాద్ :
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ రఘుపతిరెడ్డి ఇద్దరు విద్యార్థులను గొంతు పట్టుకుని వెనక్కి నెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే సీఐ ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకుని నొక్కుతూ వెనక్కి నెట్టిన దృశ్యాలు వీడియోలో కనిపించడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. గొంతు పట్టుకోవడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా వీడియోలో కనిపించడం పట్ల పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “విద్యార్థుల పట్ల పోలీసులు ఇలాగేనా వ్యవహరించేది?”, “నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులపై ఇంత దౌర్జన్యం అవసరమా?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే విద్యార్థుల పట్ల భౌతికంగా వ్యవహరించడం సమర్థనీయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన చేపడితే వారిని చర్చల ద్వారా సముదాయించాల్సింది పోయి బలప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల్లో విద్యార్థులు పాల్గొన్న సందర్భంలో పోలీసుల బాధ్యత శాంతిభద్రతలను కాపాడటమే తప్ప, వారిపై దౌర్జన్యానికి పాల్పడటం కాదని సామాజిక మాధ్యమాల్లో పలువురు పేర్కొంటున్నారు.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కూడా స్పందించారు. విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించిన సీఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన జెన్‌జీ తరహా నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరోవైపు, వైరల్ అవుతున్న వీడియోలపై అధికారికంగా పోలీసు శాఖ నుంచి ఎలాంటి పూర్తి వివరణ వెలువడాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి నేపథ్యం, పోలీసుల చర్యలకు దారితీసిన పరిస్థితులు, విద్యార్థుల ఆరోపణలపై అధికారుల స్పందన వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన అసలు సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటు, పోలీసుల ప్రవర్తనపై కూడా నిష్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని విద్యార్థి సంఘాలు, ప్రజలు కోరుతున్నారు.

You may also like...