ఓటర్ల ప్రత్యేక సవరణకు నేడే శ్రీకారం

- జూలై 24 వరకు ఇంటింటి ఎన్యూమరేషన్ ప్రక్రియ
- ప్రతి ఓటరుకు ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫారం
- హైదరాబాద్‌లో 47 లక్షలకు పైగా ఓటర్లు
- బీఎల్‌వోలు, బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ
- అవసరమైతే ఓటును హైదరాబాద్‌కు బదిలీ చేసుకునే అవకాశం
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పుల రహితంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి గణన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంటికి వెళ్లే బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఒక కుటుంబంలో ఎంత మంది ఓటర్లు ఉంటే వారికి విడివిడిగా ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. ప్రతి ఓటరు తన పాస్‌పోర్ట్ సైజు ఫోటోను జతచేసి, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు, ఓటు హక్కుకు సంబంధించిన ఇతర సమాచారాన్ని పూర్తి చేసి బీఎల్‌వోలకు అందజేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటి వద్ద అందుబాటులో లేని వారు ఎన్నికల సంఘం యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని స్వయంగా వివరాలు నమోదు చేసి జూలై 24వ తేదీలోగా అప్లోడ్ చేయవచ్చని అధికారులు తెలిపారు. అనంతరం అందిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు వివరాలను ధృవీకరిస్తారు.
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,062 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వీటిలో 47,36,669 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరిలో ఇప్పటికే 22,09,647 మంది ఓటర్ల వివరాల మ్యాపింగ్ పూర్తయింది. ఇంకా 25,27,022 మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ భారీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా 4,062 మంది బీఎల్‌వోలను నియమించారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల తరఫున 10,901 మంది బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏలు) నియమించి వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల పరిశీలన, సందేహాల నివృత్తి వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు.
ఇక ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో కూడా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు బీఎల్‌వోలు, బీఎల్ఏలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే ఓటు హక్కు ఏ ప్రాంతంలో కొనసాగించాలనే నిర్ణయం పూర్తిగా ఓటరుదేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇతర జిల్లాలు లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, వారు ఇంతకుముందు ఓటు హక్కు వినియోగించిన ప్రాంతంలోనే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం తుది ఓటర్ల జాబితా వెలువడిన తర్వాత అవసరమైతే తమ ఓటును హైదరాబాద్‌కు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఓటర్లందరూ ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వంతో రూపొందడమే కాకుండా, ప్రతి అర్హుడికి ఓటు హక్కు సక్రమంగా అందేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు
