మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించను: సీఎం రేవంత్ రెడ్డి

- మహిళా సంఘాల ద్వారా మరో 3 వేల బస్సులు ఆర్టీసీకి అప్పగిస్తాం
- మహిళా శక్తి పథకంలో 553 బస్సులకు సీఎం జెండా ఊపి ప్రారంభం
- 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
- ఇందిరమ్మ ఇళ్లు, పట్టణ గృహాలు మహిళల పేర్లపైనే మంజూరు
- మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ, రూ.500 కోట్ల వడ్డీలేని రుణాలు
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి ::
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించబోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. మహిళా శక్తి పథకం కింద ఇప్పటికే 553 బస్సులను టీజీఆర్టీసీకి అప్పగించామని, రానున్న రోజుల్లో మరో 3 వేల బస్సులను కూడా మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అందజేస్తామని ప్రకటించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాల యాజమాన్యంలోని 553 బస్సులను టీజీఆర్టీసీకి అప్పగించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మహిళల సాధికారతపై ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక పురోగతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, ఆ సంఖ్యను కోటికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. “కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం నా బాధ్యత” అని స్పష్టం చేశారు.
2034 నాటికి కోటి మంది మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో అనేక సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతానని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించాలని మహిళలకు సూచించారు.
మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి బస్సుల సరఫరా కార్యక్రమం దేశంలోనే ఒక వినూత్న నమూనాగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలోని మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధానాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని వివరించారు.
వ్యవసాయ రంగంపై కూడా సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని సూచించారు. వరి, మొక్కజొన్నలతో పాటు కందులు, మినుములు, పెసర్లు, కూరగాయలు, పండ్ల తోటల సాగును పెంచాలని కోరారు. రైతుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు రూ.2,400 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించడంలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు. మహిళా సంఘాల్లో ఉన్న చదువుకున్న మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో రైతులను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న సీఎం, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో మహిళలకు బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుపైనే మంజూరు చేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించనున్న లక్ష ఇళ్లను కూడా మహిళల పేర్లపైనే కేటాయించనున్నట్లు వెల్లడించారు.
ఆస్తి మహిళల పేరుపై ఉండటం వల్ల కుటుంబ ఆర్థిక భద్రత పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మహిళల భాగస్వామ్యంతో అమలయ్యే కార్యక్రమాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ఉంటాయని అన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇప్పటివరకు ఆర్టీసీకి ప్రభుత్వం రూ.10 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు తెలిపారు. ఈ పథకం మహిళల ప్రయాణ ఖర్చులను తగ్గించడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతోందన్నారు.
విద్యా రంగంలో కూడా మహిళల పాత్రను బలోపేతం చేస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను “అమ్మ ఆదర్శ పాఠశాల” కార్యక్రమం ద్వారా మహిళలకు అప్పగించామని పేర్కొన్నారు. అలాగే మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అందజేసినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు కేటాయించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కల్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 8 వేల స్త్రీ శక్తి భవనాలను ఒకేసారి ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో జిల్లా కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో మహిళా శక్తి భవనాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు.
స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహకారం విషయంలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటివరకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించామని, సున్నా వడ్డీ రుణాల కోసం బ్యాంకులకు రూ.2 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల కింద పలు ఆర్థిక సహాయాలను సీఎం అందజేశారు. ఆర్టీసీకి అప్పగించిన బస్సులపై అద్దె రూపంలో రూ.20.34 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు అందించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలు ఆదా చేసిన రూ.10,700 కోట్ల ప్రయోజనాలను వివరించారు. అలాగే వడ్డీ లేని రుణ పథకం కింద రూ.500 కోట్ల చెక్కులను స్వయం సహాయక సంఘాలకు అందజేశారు.
మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, సామాజిక సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గమని ఆయన స్పష్టం చేశారు.
