శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు

శంకర్‌పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు


  • 40 శాతం కూడా పూర్తి కాలేదని అధికారుల ప్రకటన
  • ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే శంకర్‌పల్లి వెనుకబాటు
  • అవగాహన లోపమా..? అధికారుల నిర్లక్ష్యమా..?
  • ప్రజల వద్దకే వెళ్లి ఫారాలు నింపించాల్సిన అవసరం
  • గడువులోపు లక్ష్యం ఎలా చేరుకుంటారు..?

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీలో మాత్రం పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటివరకు ఆన్‌లైన్ అప్డేట్ కోసం కేవలం 40 శాతం ఫారాలు మాత్రమే సిద్ధమైనట్లు వెల్లడించారు. మిగిలిన ఫారాలను త్వరగా పూర్తి చేయాలని ప్రజలకు, బీఎల్‌వోలకు సూచించారు.
అయితే ఇతర మున్సిపాలిటీల్లో SIR ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, శంకర్‌పల్లిలో మాత్రం 40 శాతం కూడా పూర్తి కాకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజలకు ముందుగానే తగిన అవగాహన కల్పించడంలో లోపం జరిగిందా? లేక క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సరిగా జరగలేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రెస్‌నోట్‌లో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు నింపిస్తున్నారని పేర్కొన్నప్పటికీ, ఇప్పటికీ లక్ష్యం సగానికి కూడా చేరుకోకపోవడం గమనార్హం. గడువు సమీపిస్తున్న వేళ ఇంకా భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేస్తేనే గడువులోపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించడం, అవసరమైన సాంకేతిక సహాయం అందించడం, ప్రత్యేక శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహించడం అవసరమని సూచిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పెండింగ్‌లో ఉన్న ఫారాలను వేగంగా పూర్తి చేసి, శంకర్‌పల్లి మున్సిపాలిటీని రాష్ట్ర సగటు స్థాయికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే SIR ప్రక్రియ ఆలస్యానికి గల కారణాలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

You may also like...