రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి

రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి

– శంకర్‌పల్లిలో కాంగ్రెస్ ఆగ్రహ నిరసన
– ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పిలుపు
– కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు
– మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
– భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణుల


జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
శంకర్‌పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆగ్రహ నినాదాలతో మార్మోగింది. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా, మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మడపతి చంద్రమౌళి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడిని రాజకీయ కక్షసాధింపుతో లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అవమానించడమేనని విమర్శించారు. విభిన్న అభిప్రాయాలను అణచివేసే ధోరణి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీకి జరిగిన అవమానానికి రాజకీయ బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే దేశ ప్రజల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను ఎదుర్కొనే బదులు అధికార బలంతో ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు.
ఈ ఆందోళనలో టీపీసీసీ కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కాలే శ్రీకాంత్, శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్ శ్వేతా పాండురంగారెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కాసెట్టి చంద్రమోహన్, సేవాదళ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంఎస్‌యూఐ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...