కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద ‘పసుపు శుద్ధి’.. ఏడుగురు అరెస్ట్‌

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ వద్ద పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వరదరాజపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ ప్రవీణ్‌ కూడా ఉన్నారు. పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం తీవ్ర వివాదానికి దారితీయడంతో దళిత సంఘాల నేతలు, కాంగ్రెస్‌ నాయకులు గజ్వేల్‌ ఏసీపీతో పాటు మర్కూక్‌ పోలీస్‌ స్టేషన్‌లో మొత్తం ఐదు ఫిర్యాదులు చేశారు.

ప్రభుత్వం ఆదేశాలతో పోలీసుల ఉక్కుపాదం

ఘటనపై ముమ్మర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసులు దర్యాప్తును సవాలుగా తీసుకున్నారు. నిందితుల కదలికలపై నిఘా పెట్టి వారి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలను ఉపయోగించారు.

విజయవాడలో పట్టుబడిన నిందితులు

విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ లాడ్జిలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ట్రాకింగ్‌ ద్వారా వారి కదలికలను పసిగట్టిన పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏడుగురు లాడ్జిలో ఉన్న సమయంలో వారిలో ఒకరు మొబైల్‌ ఫోన్‌ ఆన్‌ చేయడంతో పోలీసులు వారి ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించినట్లు సమాచారం. అనంతరం అక్కడికి చేరుకుని అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

14 రోజుల రిమాండ్‌

నిందితులను గజ్వేల్‌కు తరలించి మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. కేసు తీవ్రత, దర్యాప్తు అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఏడుగురికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు వారిని సిద్దిపేట జైలుకు తరలించారు.

మరో ఇద్దరి కోసం గాలింపు

ఈ ఘటనలో తొమ్మిది మందికి పైగా కేసు నమోదు కాగా, వరదరాజ్‌పూర్‌ మాజీ సర్పంచ్‌ ప్రవీణ్‌, భాను, మల్లేశం, ఐలయ్య, ఆర్కల రాజు, అమరేందర్‌, కొడారి రాజులను పోలీసులు అరెస్టు చేశారు. బాలముని, కనకయ్యలు మాత్రం ఇంకా పోలీసులకు చిక్కాల్సి ఉంది. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

You may also like...