హజ్ యాత్రికులకు రూ.లక్ష సబ్సిడీ విడుదల
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

హజ్ యాత్రికులకు రూ.లక్ష సబ్సిడీ విడుదల
– 331 మంది ఖాతాల్లో రూ.3.31 కోట్లు జమ
– 2026 హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వ ఊరట
– విజయవాడ నుంచి వెళ్లిన యాత్రికులకు లబ్ధి
– సీఎం హామీ మేరకు నిధుల విడుదల
– నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం
– తప్పుడు ప్రచారాలు మానుకోవాలని షరీఫ్ సూచన
అమరావతి: 2026 హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1 లక్ష సబ్సిడీని విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎన్ఎండీ షరీఫ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, విజయవాడ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు వెళ్లిన 331 మంది యాత్రికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.3.31 కోట్లు నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు.
విమాన చార్జీల అదనపు భారాన్ని తగ్గించేందుకు ఒక్కో యాత్రికుడికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. 2026లో రాష్ట్రం నుంచి మొత్తం 1,987 మంది హజ్ యాత్రకు వెళ్లగా, విజయవాడ నుంచి 331 మంది, బెంగళూరు నుంచి సుమారు 500 మంది ప్రయాణించినట్లు వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకే ఈ సబ్సిడీని విడుదల చేశామని షరీఫ్ పేర్కొన్నారు. యాత్రికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం ద్వారా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.
సబ్సిడీ విడుదల ఆలస్యమైందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని షరీఫ్ అన్నారు. హజ్ యాత్రికుల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా హజ్ యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.
