గురుకులాల్లో అశుభ్ర ఆహారం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

గురుకులాల్లో అశుభ్ర ఆహారం
- గూడూరు హాస్టల్లో విద్యార్థినుల నిరసన
- కనీస వసతుల కోసం డిమాండ్
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల దుస్థితి దయనీయ దశను దాటిపోయి దుర్భర స్థాయికి చేరినట్టుగా స్పష్టమవుతోంది. సామాజిక న్యాయం, సమానావకాశాల సంకల్పంతో స్థాపించబడిన ఈ విద్యాసంస్థలు ఇప్పుడు నిర్వాకం, నిర్లక్ష్యం, నిర్లజ్జ పరిపాలనల నిలయాలుగా మారిపోయాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నాసిరకం, నాణ్యతలేని, కలుషిత ఆహారం విద్యార్థుల ముందుంచడం కేవలం నిర్వాహక లోపం కాదు; అది విద్యార్థుల ఆరోగ్యంపై జరిగే ఘోర నిర్లక్ష్యానికి ఘాటైన గుదిబండ. పదేపదే చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు పరిపాలనా పాళీబద్ధత పతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాల పట్ల ఇంత నిర్లిప్త ధోరణి ఎలా సహించగలమన్న ప్రశ్న ప్రజల్లో ప్రబలుతోంది.
నాగర్‌కర్నూల్ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన వేళ, జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గిరిజన బాలికల వసతి గృహంలో విద్యార్థినులు రోడ్డెక్కడం వ్యవస్థపై పెరిగిన విసుగుకు ప్రతీక. కలుషిత భోజనం, కనీస వసతుల కొరత, పర్యవేక్షణ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరగతులను బహిష్కరించడం సాధారణ నిరసన కాదు; అది బాధతో కూడిన బహిరంగ ప్రతిఘటన. “మంచి ఆహారం ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి” అన్న వారి డిమాండ్లు దయనీయ దశను దాటిన దృశ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రిన్సిపాల్‌పై నినాదాలు వినిపించడం నిర్వహణలోని ముడుపులను, మూలాల వరకు చేరిన నిర్లక్ష్యాన్ని వెలికితీస్తోంది.
ప్రశ్నలు పరంపరగా ఎదురొస్తున్నాయి. ఆహార సరఫరా వ్యవస్థలో ఉన్న అవకతవకలు ఎక్కడ ఆగుతాయి? నాణ్యత తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమా? బాధ్యులపై కఠిన చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? ప్రతి ఘటన తర్వాత ప్రకటనలు, పరిశీలనలు, హామీల హోరునడుస్తున్నా నేలమీద మార్పు కనిపించకపోవడం పరిపాలనా పతనానికి ప్రతిబింబం. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై రాజీ పడే పరిస్థితి అసహ్యం. గురుకులాలు జ్ఞానాలయాలా? లేక నిర్లక్ష్యపు నిలయాలా? అన్న సందేహం సమాజాన్ని కలవరపెడుతోంది.
సంక్షేమం పేరుతో సాగుతున్న నిర్వాహక నిర్లక్ష్యానికి ఇక ముగింపు పలకాలిసిన సమయం ఆసన్నమైంది. సమగ్ర సంస్కరణలు, కఠిన నియంత్రణలు, నిర్దాక్షిణ్య చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. విద్యార్థుల భవిష్యత్తు భద్రతను పణంగా పెట్టే నిర్లక్ష్య ధోరణిని సహించలేం. గురుకులాలు సురక్షిత వసతుల సాక్ష్యాలుగా, నాణ్యమైన విద్యా విలువల కేంద్రాలుగా నిలవాలంటే ఇప్పుడే దృఢ నిర్ణయాలు, దండయాత్రలా మార్పులు అవసరం. లేకపోతే ఈ వ్యవస్థపై ప్రజల విశ్వాసం శాశ్వతంగా చెదిరిపోవడం అనివార్యం.
