జూలై 4న టీజీ పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లు
- హజ్ యాత్రికులకు రూ.లక్ష సబ్సిడీ విడుదల - July 1, 2026
- జూలై 4న టీజీ పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లు - July 1, 2026
- రామమందిరం విరాళాల చోరీ వెనుక భారీ కుట్ర - July 1, 2026

జూలై 4న టీజీ పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లు
- జూలై 3 వరకు దరఖాస్తుల స్వీకరణ..
- మిగిలిన సీట్ల భర్తీకి తుది అవకాశం
- ఒరిజినల్ ధ్రువపత్రాలు తప్పనిసరి..
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం లేదు
జ్ఞాన తెలంగాణ / తెలంగాణ బ్యూరో:
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు టీజీ పాలిసెట్–2026 స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, నేటి నుంచి జూలై 3వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూలై 4న రాష్ట్రవ్యాప్తంగా సంబంధిత పాలిటెక్నిక్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించగా, అనంతరం కూడా ఖాళీగా మిగిలిన సీట్లను జూలై 8లోపు భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ విద్యార్థులకు చివరి అవకాశంగా అధికారులు స్పష్టం చేశారు.
స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీటు పొందే అభ్యర్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని కన్వీనర్ దేవసేన కుండబద్దలు కొట్టారు. అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశ ప్రక్రియలో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎలాంటి సడలింపులు ఉండవని, నిబంధనల అమలులో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, టీజీ పాలిసెట్ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియలో 1,229 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. జూన్ 27, 28 తేదీల్లో అభ్యర్థులు నమోదు చేసిన ఆప్షన్లను సమగ్రంగా పరిశీలించి సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో 1,619 మంది అభ్యర్థులు మొత్తం 3,015 ఆప్షన్లు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అభ్యర్థులు తమ సీట్ల కేటాయింపు వివరాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించి, నిర్ణీత గడువులోపు తదుపరి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నిర్లక్ష్యం, ఆలస్యం, అసంపూర్ణ పత్రాల కారణంగా అవకాశం కోల్పోతే అందుకు అభ్యర్థులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని డిప్లొమా విద్యలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు నిర్ణయాత్మక దశగా నిలవనున్నాయి.
