వర్సిటీలో వేధింపుల ఆరోపణలు.. బీఆర్ఎస్ ఆగ్రహం!
- భూ రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు! - November 10, 2026
- కరవు కోరల్లో రైతులు.. - November 10, 2026
- బీసీ ర్యాలీకి రాహుల్కు ఆహ్వానం! - November 10, 2026

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి:
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. బాధిత మహిళా ప్రొఫెసర్లను పరామర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. న్యాయం కోసం నిరసన చేపడుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులకు తమ మద్దతు తెలిపారు.
విద్యా సంస్థల్లో మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమని, బాధితుల ఫిర్యాదులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేయకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బాధిత మహిళా ప్రొఫెసర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో మహిళలకు గౌరవప్రదమైన, సురక్షితమైన పని వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నిరసన చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థుల గొంతును ప్రభుత్వం వినాలని, వారి ఆందోళనలకు పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
