నేడు హైదరాబాద్‌లో విద్యుత్‌ కోతల మోత!

హైదరాబాద్‌,వెబ్ డెస్క్ : నగర ప్రజలకు నేడు విద్యుత్‌ కోతల సెగ తగలనుంది. నిర్వహణ పనుల పేరుతో విద్యుత్‌ శాఖ పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనుండటంతో ప్రజలకు అసౌకర్యం తప్పేలా లేదు. బోయినపల్లి, రామంతాపూర్‌ పరిధిలో మంగళవారం విద్యుత్‌ కోతలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బోయినపల్లి 11 కేవీ ఫీడర్‌ పరిధిలో చెట్ల నరికివేత, ఏబీ స్విచ్‌ మరమ్మతుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుంది. పార్క్‌ ఎవెన్యూ, గ్రీన్‌ వ్యూ ఎన్‌క్లేవ్‌, ఫరీద్‌నగర్‌, అబ్రార్‌నగర్‌, మనోవికాస్‌ నగర్‌, రిలయన్స్‌ విల్లా మార్ట్‌, రాయల్‌ ఎన్‌క్లేవ్‌, ఎస్‌బీఐ కాలనీ, ఆరావళి ఎన్‌క్లేవ్‌ ప్రాంతాల ప్రజలు విద్యుత్‌ అంతరాయాన్ని ఎదుర్కోనున్నారు. ఈ విషయాన్ని బోయినపల్లి సీబీడీ నాగరాజు వెల్లడించారు.

మరోవైపు రామంతాపూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వార్షిక మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నారు. గోఖలే నగర్‌, పీఎస్‌ కాలనీ, గణేష్‌ నగర్‌, చర్చి కాలనీ, దూరదర్శన్‌ కేంద్రం, వెంకట్‌ రెడ్డి నగర్‌, ఇందిరా నగర్‌, ప్రగతి నగర్‌, శారదా నగర్‌, ఆర్టీసీ కాలనీ, ఎండోమెంట్‌ కాలనీ తదితర ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా ఉండదు. ఈ మేరకు ట్రాన్స్‌కో ఏఈయూ మేఘనాదం ప్రకటన విడుదల చేశారు.

విద్యుత్‌ కోతలతో గృహిణులు, వ్యాపారులు, చిరు వ్యాపారులు, కార్యాలయాల కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి సరఫరా, గృహ అవసరాలు, విద్యుత్‌ ఆధారిత పనులకు అంతరాయం కలగనుంది. మరమ్మతులు చేపట్టడం అవసరమే అయినప్పటికీ, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్‌ కోతలపై ముందస్తు సమాచారం అందించిన అధికారులు, వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నిర్వహణ పనుల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

You may also like...