అక్రమ బోర్లు రహదారుల కబ్జాపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

చెరువుల చెంత అక్రమ బోర్లు.. రహదారుల ఆక్రమణలు

హైడ్రా ప్రజావాణికి 36 ఫిర్యాదులు

హైదరాబాద్: నగర పరిధిలో చెరువుల ఆక్రమణలు, అక్రమ బోర్లు, రహదారుల కబ్జాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 36 ఫిర్యాదులు అందాయి. వీటిలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రహదారుల కబ్జాలు ప్రధానంగా ఉన్నాయి.

చెరువుల సమీపంలో అక్రమంగా బోర్లు ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి విక్రయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనివల్ల గృహావసరాలకు నీటి కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిల్మ్‌నగర్ చెరువు పరిధిలోని కౌషర్ కాలనీలో 30 అడుగుల రహదారిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని తొలగించి రహదారిని అందుబాటులోకి తేవాలని కోరారు. ఖాజాగూడ గ్రామం సర్వే నంబర్ 23లోని 2.38 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని ఫిర్యాదు అందింది.

మియాపూర్ శ్రీలక్ష్మీనగర్ కాలనీలోని నాయనమ్మకుంట చెరువు ఆక్రమణలను అడ్డుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. నెక్నాంపూర్ బాపు హిల్స్‌లో రహదారుల ఆక్రమణలు, బోడుప్పల్ గాయత్రి హిల్స్‌లో నివాసాల మధ్య టపాసుల దుకాణం, స్టాక్ పాయింట్ నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి.

కీసర మండలం తుమ్మలకుంట చెరువు నుంచి అక్రమంగా నీటిని తోడుతూ విక్రయించడంతో పాటు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు.

అందిన 36 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి, వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్రజా ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

You may also like...