KGBV SOలు, CRTలకు సెలవుల వెసులుబాటు
- KGBV SOలు, CRTలకు సెలవుల వెసులుబాటు - August 12, 2026
- ఎయిడ్స్‌పై అవగాహనకు భారీ ర్యాలీ - August 12, 2026
- కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు మధ్యంతర స్టే - August 12, 2026

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, ఆగస్టు 13: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (SOs), కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ CRTలకు క్యాజువల్ లీవుల విషయంలో ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. నెలకు గరిష్టంగా రెండు క్యాజువల్ లీవులు మాత్రమే వినియోగించుకోవాలనే పరిమితిని ఎత్తివేస్తూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డా. ఈ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు 2026 ఆగస్టు 11న Rc.No.1027454/SS/T9/KGBV/2026 ద్వారా రాష్ట్రంలోని హైదరాబాద్, మెదక్ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష ఎక్స్‌ఆఫిషియో జిల్లా ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు పంపించారు. 2018 జూలై 21న జారీ చేసిన పాత ఉత్తర్వులను పాక్షికంగా సవరిస్తూ తాజా ఆదేశాలు వెలువడ్డాయి.
గతంలో KGBVలలో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ CRTలకు ఏడాదికి 15 క్యాజువల్ లీవులు మంజూరు చేయడంతో పాటు నెలకు గరిష్టంగా రెండు CLలు మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధన అమల్లో ఉండేది. తాజా ఉత్తర్వులతో ఈ నెలవారీ పరిమితిని పూర్తిగా తొలగించారు.
ఇకపై అర్హులైన SOలు, CRTలు సంవత్సరానికి మొత్తం 15 క్యాజువల్ లీవులను అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా వినియోగించుకునే అవకాశం కల్పించారు. అయితే సెలవుల వినియోగం సంబంధిత శాఖా నిబంధనలు, పాఠశాల నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది.
నెలవారీ పరిమితి తొలగింపుతో KGBV సిబ్బందికి వ్యక్తిగత అవసరాలు, అత్యవసర పరిస్థితుల్లో సెలవులు వినియోగించుకునే విషయంలో మరింత స్వేచ్ఛ లభించినట్లయింది. తాజా ఉత్తర్వులను జిల్లా స్థాయిలో అమలు చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాజెక్టు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
