22ఏ ఆస్తులకు రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం
- 22ఏ ఆస్తులకు రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం - September 24, 2026
- ఆదిలాబాద్ జిల్లా స్వేరోస్ నూతన కమిటీ ఎన్నిక - September 24, 2026
- ఎస్ఐఆర్ మంటలు..సీఈసీపై అభిశంసన సమరశంఖం - September 24, 2026

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:
తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి చట్టబద్ధమైన ప్రణాళికా సంస్థల నుంచి అనుమతులు పొందిన లేఅవుట్లు, ప్లాట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో 22ఏ జాబితాలో ఆస్తులు ఉండటంతో చాలాకాలంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన యజమానులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని అనేక హౌసింగ్ కాలనీలు, లేఅవుట్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. సాంకేతిక కారణాలు, రెవెన్యూ రికార్డుల్లోని వర్గీకరణలు లేదా ఇతర కారణాలతో 22ఏ జాబితాలో చేరినప్పటికీ, సంబంధిత ఆస్తికి చట్టబద్ధమైన ప్రణాళికా సంస్థ అనుమతి ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో యజమానులు తమ ఆస్తులను విక్రయించడం, బదిలీ చేయడం వంటి లావాదేవీలను చట్టబద్ధంగా కొనసాగించేందుకు మార్గం ఏర్పడింది. అయితే సంబంధిత యజమానులు తమ ఆస్తికి సంబంధించిన అనుమతులు, లేఅవుట్ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఇతర అవసరమైన రికార్డులతో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. మరోవైపు 22ఏ భూముల వ్యవహారంలో గతంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీలో జరిగిన చర్చల అనంతరం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఛైర్‌పర్సన్‌గా, రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్‌కుమార్ ఝా సభ్యులుగా ఈ కమిటీ పనిచేయనుంది. సంబంధిత జిల్లాల కలెక్టర్లు కూడా కమిటీకి సహకరించనున్నారు. 22ఏ జాబితాలో భూములు చేరిన విధానం, రికార్డుల్లో జరిగిన మార్పులు, నిబంధనల ఉల్లంఘనలు, అనుమతుల ప్రక్రియ తదితర అంశాలను కమిటీ పరిశీలించనుంది. ఈ విచారణ కేవలం 22ఏ అంశానికే పరిమితం కాకుండా భూములకు సంబంధించిన ఇతర అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను కూడా పరిశీలించే పరిధి కలిగి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో ఒకవైపు చట్టబద్ధమైన అనుమతులు ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మార్గం ఏర్పడగా, మరోవైపు భూముల రికార్డుల్లో జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లయింది.
