ఏఐ వేట.. ఒరాకిల్‌ ఉద్యోగుల బలి!

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ మరోసారి ఉద్యోగులపై కత్తి దూసింది. సంస్థాగత మార్పుల పేరుతో సోమవారం తెల్లవారుజామునే కొందరు ఉద్యోగులకు తొలగింపు ఈ-మెయిల్స్‌ పంపింది. అదే రోజు చివరి పనిదినమని ప్రకటించడంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముందస్తు హెచ్చరిక లేకుండానే ఉద్యోగాలను ఊడబీకిన యాజమాన్య తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది ఉద్యోగులకు ఈ-మెయిల్‌ అందకముందే కంపెనీ అంతర్గత వ్యవస్థల యాక్సెస్‌ను నిలిపివేసినట్లు సమాచారం. లాగిన్‌, స్లాక్‌ వంటి సిస్టమ్స్‌ నుంచి బయటకు పంపి.. ఆ తర్వాత తొలగింపు సమాచారం ఇవ్వడం ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. సెవరెన్స్‌ ప్యాకేజీ వివరాలను వ్యక్తిగత ఈ-మెయిల్‌కు పంపుతామని సంస్థ పేర్కొంది.

తాజా వేటలో ఎంతమందిని సాగనంపారో ఒరాకిల్‌ అధికారికంగా వెల్లడించలేదు. అయితే మే 31తో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 21 వేల మంది ఉద్యోగులను, అంటే 13 శాతం సిబ్బందిని తొలగించింది. దీంతో కంపెనీలో పూర్తిస్థాయి ఉద్యోగుల సంఖ్య 1.41 లక్షలకు పడిపోయింది.

ఒకవైపు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ.. మరోవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఒరాకిల్‌ భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం ఏకంగా 90–95 బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని అంచనా వేస్తోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ మానవ వనరుల అవసరం తగ్గుతోందనే సంకేతాలు ఇప్పటికే స్పష్టమయ్యాయి.

లింక్డ్‌ఇన్‌, రెడ్డిట్‌ వంటి వేదికల్లో పలువురు ఉద్యోగులు తమ తొలగింపులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ విభాగాల్లో ఎంతమేర కోతలు విధించారనే విషయాన్ని సంస్థ గోప్యంగానే ఉంచుతోంది. ఏఐ సామర్థ్యాలను పెంచేందుకు బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్న ఒరాకిల్‌.. అదే సాంకేతికత నీడలో ఉద్యోగులను బలిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

You may also like...