మహాలింగాపురంలో రోడ్డు గుంతలకు శాశ్వత మరమ్మతులు
- సరిత తిరుపతయ్యకు జన్వాడ మాజీ సర్పంచ్ వివాహ ఆహ్వానం - August 18, 2026
- మహాలింగాపురంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన - August 18, 2026
- జాతీయ ఫ్యామిలీ ప్రయోజన చెక్కు అందజేత - August 18, 2026

శంకర్పల్లి నుంచి వికారాబాద్ వెళ్లే ప్రధాన మార్గంలోని మహాలింగాపురం గ్రామం ఎల్లమ్మ ఆలయం సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా గ్రామ సర్పంచ్ మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు.
ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డుపై పలుమార్లు మట్టి పోసి తాత్కాలికంగా గుంతలను పూడ్చినప్పటికీ, వర్షాలు కురిసిన ప్రతిసారీ అవి తిరిగి ఏర్పడుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు కూడా నెలకొంది.
ఈ సమస్యకు తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇసుక, కంకర, సిమెంట్‌ను వినియోగించి గుంతలను పటిష్టంగా పూడ్చేలా పనులు చేయించారు. వర్షాలకు మళ్లీ గుంతలు ఏర్పడకుండా రహదారి ఉపరితలాన్ని బలోపేతం చేసే విధంగా మరమ్మతులు చేపట్టారు.
గ్రామ ప్రజలకు, రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడటమే తమ లక్ష్యమని సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించి, సంబంధిత ప్రాంతాల్లో తక్షణమే చర్యలు తీసుకోవడంలో గ్రామపంచాయతీ ముందుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మొదటి వార్డు సభ్యులు హేమలత విట్టల్, మాజీ వార్డు సభ్యుడు జాఫర్ ఖాన్,నాయకులు గొల్ల రాంచంద్రర్, బోడ దయాకర్, నర్సరీ కృష్ణ,తల్లా నాగేష్ తదితరులు పాల్గొన్నారు. గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
