మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చిన ప్రీతిరెడ్డి

హైదరాబాద్‌:
మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను కలిశారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కమిషన్‌ లేవనెత్తిన సందేహాలు, ప్రశ్నలకు వివరణ ఇచ్చేందుకు ఆమె కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా కమిషన్‌ అడిగిన పలు అంశాలపై సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రీతిరెడ్డి.. విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ హోదాలో కమిషన్‌ అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చినట్లు తెలిపారు. కాలేజీల్లో సినీ కార్యక్రమాలు, ఇతర వేడుకల నిర్వహణపై వస్తున్న వార్తలకు స్పందిస్తూ తమ విద్యాసంస్థలకు చెందిన మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఏడాది కాలంలో కేవలం మూడు ఈవెంట్లు మాత్రమే నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థుల రోజువారీ తరగతులకు ఎలాంటి అంతరాయం కలగలేదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు, ఆదేశాలను తమ విద్యాసంస్థలు కచ్చితంగా పాటిస్తాయని ప్రీతిరెడ్డి వెల్లడించారు. కళాశాలల్లో వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించే సమయంలో యాజమాన్యంతో పాటు విద్యార్థులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల భద్రత, విద్యాభ్యాసం, భవిష్యత్తుకు తమ యాజమాన్యం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కమిషన్‌ అడిగిన అంశాలపై వివరణ ఇచ్చామని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే విద్యాసంస్థలను నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు.

You may also like...