గిగ్‌ వర్కర్ల ర్యాలీకి రాహుల్‌ గాంధీ

హైదరాబాద్‌:
గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ ఆధారిత కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 14న హైదరాబాద్‌లో నిర్వహించనున్న గిగ్‌ వర్కర్ల భారీ ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులు, ఆకాంక్షలను తెలుసుకోనున్నారు. రాష్ట్రంలోని గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన కీలక నిబంధనలు, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నట్లు సమాచారం.

హెచ్‌ఐసీసీ సమీపంలోని జయభేరి, మీనాక్షి టవర్స్‌ పక్కన ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, గడ్డం వివేక్‌ వెంకటస్వామి పరిశీలించారు. సభా వేదిక, ర్యాలీ నిర్వహణ, కార్మికుల రాకపోకలు, ఇతర సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. ర్యాలీ శిల్పకళావేదిక నుంచి హెచ్‌ఐసీసీ వరకు కొనసాగనుంది. అనంతరం సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో సుమారు ఆరు లక్షల మంది గిగ్‌ వర్కర్లు వివిధ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పనిచేస్తున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. స్విగ్గీ, జొమాటో, రాపిడో వంటి సంస్థల్లో డెలివరీ సిబ్బందిగా, క్యాబ్‌ డ్రైవర్లుగా, ఇతర సేవల్లో పనిచేస్తున్న వారికి ప్రమాద బీమా, సామాజిక భద్రత, సంక్షేమ సదుపాయాలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కార్మికుల నమోదు, సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

గిగ్‌ వర్కర్లకు రక్షణ, గౌరవం, మెరుగైన జీవన భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పేర్కొంటున్నారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన చట్టం అమలులో భాగంగా నిబంధనలు, సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి అంశాలకు ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాలకు అతీతంగా కార్మికుల భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ర్యాలీ ద్వారా గిగ్‌ వర్కర్ల సమస్యలు, వారి హక్కులు, సామాజిక భద్రత అంశాలు మరోసారి చర్చకు రానున్నాయి. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎంత సమర్థంగా అమలవుతాయన్నది కీలకంగా మారనుంది.

You may also like...