వాట్సాప్ ఆర్డర్లు.. రాపిడో డెలివరీలు!
- ముద్ర రుణ పథకానికి మరో ఐదేళ్ల పొడిగింపు - November 12, 2026
- గిగ్ వర్కర్ల ర్యాలీకి రాహుల్ గాంధీ - November 12, 2026
- అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపులు! - November 12, 2026

హైదరాబాద్:
నిషేధిత ఈ-సిగరెట్లు (వేప్స్) విక్రయించేందుకు అక్రమ వ్యాపారులు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ, రాపిడో సేవలను ఉపయోగించి వినియోగదారుల ఇళ్లకే వేప్స్ చేరవేస్తున్న వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ దందాపై ఈగల్ తెలంగాణ బృందం, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ‘స్మోకిన్ స్పాట్’ అవుట్‌లెట్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 46 వేప్స్, 49 విదేశీ సిగరెట్ ప్యాకెట్లు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు పేమెంట్ స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో ఒక్కో వేప్‌ను రూ.2,800 నుంచి రూ.4,000 వరకు విక్రయించినట్లు వెల్లడైనట్లు సమాచారం. 2026 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య సుమారు 107 వేప్ పరికరాలను విక్రయించినట్లు దర్యాప్తులో గుర్తించారు. సాధారణ దుకాణాల్లో నేరుగా విక్రయించడంతో పాటు, వాట్సాప్ ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్లు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఆర్డర్ ఖరారైన తర్వాత డిజిటల్ చెల్లింపులు, నగదు రూపంలో డబ్బులు వసూలు చేసి, రాపిడో ద్వారా కస్టమర్ల ఇళ్లకు సరుకులు పంపించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దందా వెనుక కేవలం ఒక అవుట్‌లెట్ మాత్రమే కాకుండా అంతర్రాష్ట్ర సరఫరా వ్యవస్థ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సరఫరాదారుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌కు రూ.10 కోట్లకు పైగా విలువైన అక్రమ వ్యాపారంతో సంబంధాలు ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, పేమెంట్ స్కానర్ల ఆధారంగా ఆర్డర్లు ఇచ్చిన వినియోగదారులు, సరఫరా చేసిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వేప్స్ అక్రమ విక్రయాలపై చేపట్టిన చర్యల్లో ఇప్పటివరకు 11 కేసులు నమోదు చేసి 18 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరో 21 మంది పరారీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో మొత్తం 1,619 వేప్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలకు డిజిటల్ వేదికలు, డెలివరీ సేవలను వినియోగిస్తున్న నేపథ్యంలో సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అక్రమ వ్యాపారానికి సంబంధించిన ప్రతి లావాదేవీని పరిశీలిస్తూ, సరఫరాదారులు, విక్రేతలు, కొనుగోలుదారుల వివరాలను సేకరిస్తున్నారు.
