దోమకొండ గర్ల్స్ హైస్కూల్‌లో విద్యార్థినులకు పోలీసుల అవగాహన కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, దోమకొండ ఎస్సై శ్రీ ప్రభాకర్ సూచనలతో మంగళవారం దోమకొండ గర్ల్స్ హైస్కూల్‌లో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థినులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, వాటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాటలు, పాటల ద్వారా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను జాగ్రత్తగా వినియోగించాలని, తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. విద్యార్థులు మంచి లక్ష్యంతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, చిన్న పొరపాట్లు కూడా జీవితాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలను పాటించాలని, మూఢనమ్మకాలను నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి చిన్న నేరాలకు కూడా పాల్పడవద్దని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 112, సైబర్ నేరాల ఫిర్యాదులకు 1930, మాదక ద్రవ్యాల సమాచారానికి 1908, మహిళల రక్షణ కోసం షీ టీమ్ నంబర్ 8712686094కు సంప్రదించాలని వివరించారు. కామారెడ్డి షీ టీమ్ మహిళల రక్షణ కోసం చేపడుతున్న చర్యలు, పోక్సో చట్టం, మైనర్లపై జరిగే నేరాలు, వాటి చట్టపరమైన పరిణామాల గురించి మహిళా పోలీస్ సిబ్బంది డబ్ల్యూపీసీలు శ్రీ సౌజన్య, శ్రీ ప్రవీణ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషారావు, పీసీ ప్రభాకర్, దోమకొండ బ్లూకోట్స్ సిబ్బంది పీసీ సాయి, హెచ్‌జీ రవీందర్ పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శరత్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.

You may also like...