రూ.5 లక్షల లంచం తీసుకుంటూ కీసర సీఐ, ఎస్‌ఐ ఏసీబీకి చిక్కిన ఖాకీల వైనం

1012742560.jpg

జ్ఞానతెలంగాణ,కీసర: రేషన్‌ బియ్యం కేసులో నిందితులకు బెయిల్‌ ఇప్పించేందుకు భారీగా లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్‌ చేసి, అందులో భాగంగా రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కీసర చెరువు వద్ద నిమజ్జనం విధుల్లో ఉన్న సమయంలో కారులో లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను గమనించి అక్కడి నుంచి పరుగులు తీసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్‌ బియ్యం కేసులో నిందితులను గత కొంతకాలంగా లంచం పేరుతో వేధించడంతో పాటు, కేసు నుంచి బయటపడేందుకు భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేసినట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ తీసుకురావాలని సీఐ వేధించినట్లు కూడా ఆరోపణలు వెలువడ్డాయి. కెమికల్‌ టెస్టులు చేయించకుండా కేసు విషయంలో ముప్పుతిప్పలు పెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్ని రూ.5 లక్షలు స్వీకరిస్తున్న సమయంలో పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీస్‌ శాఖలో కలకలం రేగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసుల్లో నిందితులపై ఒత్తిడి తెచ్చి డబ్బులు డిమాండ్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవనే సంకేతాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారికంగా నమోదైన అభియోగాలు, తదుపరి ఏసీబీ చర్యలు వెల్లడికావాల్సి ఉంది.

You may also like...