విదేశీ భారతీయుల సత్తా..
- హయత్‌నగర్ సమీపంలో ఘోర ప్రమాదం - September 15, 2026
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన - September 15, 2026
- తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం భేటీ - September 15, 2026

పదేళ్లలో 2.5 రెట్లు పెరుగుదల
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు మాతృభూమికి పంపుతున్న సొమ్ము రికార్డు స్థాయికి చేరింది. రెమిటెన్సుల విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది భారత్‌కు ఏకంగా 151 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు అందాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.14.47 లక్షల కోట్లు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ) సోమవారం విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవాస భారతీయుల నుంచి వస్తున్న నిధుల ప్రాధాన్యం ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
63 బిలియన్ డాలర్ల నుంచి 151 బిలియన్ డాలర్లకు
2016లో భారత్‌కు వచ్చిన రెమిటెన్సులు 63 బిలియన్ డాలర్లు మాత్రమే. పదేళ్ల వ్యవధిలో అవి ఏకంగా రెండున్నర రెట్లు పెరిగి 151 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది మొత్తం రెమిటెన్సులు 728.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో భారత్ వాటా అత్యంత భారీగా ఉంది. ఈ నిధులు ప్రవాస భారతీయులు తమ కుటుంబాలు, బంధువులకు పంపే వ్యక్తిగత సొమ్ము మాత్రమేనని ఐఎఫ్ఏడీ స్పష్టం చేసింది. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, సంస్థాగత బదిలీలను రెమిటెన్సుల లెక్కల్లో చేర్చలేదని పేర్కొంది.
ఆధార్.. యూపీఐతో డిజిటల్ దూకుడు
భారత్‌లో బలమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ రెమిటెన్సుల వృద్ధికి కీలకంగా మారిందని ఐఎఫ్ఏడీ ప్రశంసించింది. ముఖ్యంగా ఆధార్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వంటి వ్యవస్థలు విదేశాల నుంచి వచ్చే సొమ్మును లబ్ధిదారులకు వేగంగా, సులభంగా చేరేందుకు దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. దేశీయంగా ఏర్పడిన బలమైన డిజిటల్ మౌలిక వ్యవస్థ సామర్థ్యానికి ఇది నిదర్శనమని తెలిపింది. డిజిటల్ చెల్లింపులు విస్తరించడంతో డబ్బు బదిలీల ప్రక్రియ మరింత సులభతరమైందని స్పష్టం చేసింది.
కుటుంబాలకే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకూ ఊతం
రెమిటెన్సులు కేవలం కుటుంబాల రోజువారీ అవసరాలను తీర్చే సొమ్ము మాత్రమే కాదని ఐఎఫ్ఏడీ పేర్కొంది. విద్య, వైద్యం, గృహ అవసరాలు వంటి ఖర్చులతో పాటు సంక్షోభ సమయాల్లో కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నిధులు కీలకంగా మారుతున్నాయని తెలిపింది. అంతేకాకుండా ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తూ దేశ ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడుతున్నాయని ఐఎఫ్ఏడీ ప్రెసిడెంట్ అల్వారో లారియో పేర్కొన్నారు. సరైన ఆర్థిక సేవలు అందుబాటులో ఉంటే రెమిటెన్సుల ప్రయోజనాలను మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
గల్ఫ్ దేశాలే కీలకం.. ముప్పు కూడా అక్కడే
భారత్‌కు వస్తున్న రెమిటెన్సుల్లో గల్ఫ్ దేశాల వాటా అత్యధికంగా ఉంది. అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులు పంపుతున్న సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ అండగా నిలుస్తోంది. అయితే ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంపై అధిక ఆధారపడటం ఒక సవాలుగా మారే అవకాశం ఉందని ఐఎఫ్ఏడీ హెచ్చరించింది. ఆయా దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే దాని ప్రభావం భారతీయ కార్మికులు, వారి కుటుంబాలపై పడే ప్రమాదం ఉందని సూచించింది. డబ్బు పంపడమే కాకుండా ప్రవాస భారతీయులు తమ నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార సంబంధాలతో కూడా దేశ ప్రగతికి తోడ్పడుతున్నారని నివేదిక వెల్లడించింది. ఇటీవలి సంక్షోభాలను తట్టుకుని కూడా రెమిటెన్సుల ప్రవాహం స్థిరంగా కొనసాగడం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రవాస భారతీయులు ఎంతటి బలమైన ఆధారమో చాటిచెబుతోంది.
