ప్రతి పనిలో పరిపూర్ణతే విజయానికి పునాది
- శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - August 16, 2026
- రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఎట్ హోమ్ రిసెప్షన్ - August 15, 2026
- అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు - August 15, 2026

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్) కింద వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న యువతతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువతకు వృత్తి జీవితంలో బాధ్యత, క్రమశిక్షణ, పనిలో నాణ్యత ఎంత ముఖ్యమో వివరించారు. ఏ పని చేపట్టినా అత్యంత జాగ్రత్తగా, పరిపూర్ణతతో పూర్తి చేయాలని సూచించారు.
తాము చేసే చిన్న తప్పిదం కూడా ఇతరులకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ఒక మోటార్‌సైకిల్ తయారీలో చిన్న భాగంలో లోపం ఏర్పడినా, ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని ఉదాహరణగా చెప్పారు. అందువల్ల ప్రతి పనిని నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతతో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
బ్యాంకింగ్ రంగంలో జరిగే పొరపాట్లను కూడా ఆమె ప్రస్తావించారు. ఒక ఖాతాకు రూ.వెయ్యి పంపాల్సిన సమయంలో పొరపాటున రూ.లక్ష బదిలీ చేస్తే దాని ప్రభావం సంబంధిత వ్యక్తిపై పడుతుందని వివరించారు. అదేవిధంగా డిజిటల్ సమాచారాన్ని నిర్వహించే సమయంలో చిన్న పొరపాటు జరిగినా కస్టమర్లకు కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
“మీరు నష్టపోరు.. వేరొకరు ఆ నష్టాన్ని భరించాల్సి రావచ్చు” అనే విషయాన్ని యువత ఎప్పుడూ గుర్తుంచుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రతి క్షణం అప్రమత్తంగా, నిబద్ధతతో, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలని చెప్పారు. ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ప్రతి పనిని నేర్చుకునే అవకాశంగా తీసుకోవాలని యువతకు సూచించారు.
దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన యువత ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ద్వారా పరిశ్రమలలో ప్రత్యక్ష అనుభవం, వృత్తి నైపుణ్యాలను సంపాదిస్తున్నారని నిర్మలా సీతారామన్ అభినందించారు. పీఎంఐఎస్ ద్వారా దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలలపాటు హ్యాండ్స్‌ఆన్ అనుభవం పొందే అవకాశం యువతకు లభిస్తోందని తెలిపారు. విద్యా రంగంలో నేర్చుకున్న జ్ఞానాన్ని పరిశ్రమ అవసరాలకు అనుసంధానం చేయడంతో పాటు విద్యా–పరిశ్రమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
