‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఈసీ బ్రేక్..
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకుంటే దరఖాస్తు మూసివేత హెచ్చరిక
హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక షాక్ ఇచ్చింది. ‘తెలంగాణ రక్షణ సేన (TRS)’ పేరుతో పార్టీ నమోదు కోసం చేసిన దరఖాస్తుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు అందిన నేపథ్యంలో, అదే పేరుతో రిజిస్ట్రేషన్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. పార్టీ నమోదు ప్రక్రియ కొనసాగాలంటే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఆదేశిస్తూ కవితకు అధికారిక లేఖ పంపింది. నిర్ణీత గడువులోగా కొత్త పేర్లు పంపకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండానే దరఖాస్తును మూసివేస్తామని ఈసీ హెచ్చరించింది.
అయితే, ఈసీ నిర్ణయంపై కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం లేఖలో పేర్కొన్న అభ్యంతరాలకు ఇప్పటికే రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చామని, ప్రత్యామ్నాయ పేర్లు పంపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపైనే ముందుకు వెళ్తామని, అవసరమైతే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కవిత ‘తెలంగాణ ప్రజా జాగృతి’, ‘తెలంగాణ జాగృతి’, ‘తెలంగాణ రక్షణ సేన’, ‘తెలంగాణ రాష్ట్ర జాగృతి’, ‘తెలంగాణ ప్రజా శక్తి’ అనే ఐదు పేర్లను ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. అనంతరం ఏప్రిల్ 25న నిర్వహించిన ఆవిర్భావ సభలో పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించగా, మూడు రోజులకే దానిని ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్చారు. ప్రస్తుతం ఈసీ తాజా నిర్ణయంతో ‘TRS’ పేరును కవిత దక్కించుకుంటారా? లేక కొత్త పేరుతో ముందుకు వెళ్తారా? అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
