“ఆ క్రమంలో “

పుడమిపైకి
ఎలా వచ్చామో
అలాగే పోతాం…

కానీ పోయే లోగా
కొద్దిమందితోనైనా
జ్ఞాపకాలను
పదిలపరచుకోవాలి….!!

జీవితంలో
కొన్ని పరిచయాలు
అవసరాల దారులు
కావచ్చు గాక….

“ఆ క్రమంలో “
విరుచుకుపడుతున్న
ప్రచండ శబ్ద భేరుండం
ముందు బెదురు పిట్టలా
ఓటమి పలకరించినా…

ఆ ఓటమిని
ఎలా తట్టుకోవాలో
నేర్చుకోవాలి….!!

జీవితంలో…..
కొన్ని పరిచయాలు
ఆనందాల తీరాలు
కావచ్చు గాక….

“ఆ క్రమంలో”
అంతులేని
కోరికల ఊబిలో
నిత్యం ఊగిసలాడక…

మనసును
మౌనం చేయడం
నేర్చుకోవాలి….!!

జీవితంలో….
కొన్ని పరిచయాలు
జ్ఞాపకాల మల్లెలు
కావచ్చు గాక ‌…

“ఆ క్రమంలో”
ఎవరికీ అంతు పట్టని
బ్రహ్మ పదార్థం మరణం
కల్లోల భరితమైన
కఠిన వాస్తవంగా
పలకరించేలోపు….

నాది అనే
అహంకారపు
పొరలను వీడి
అంతర్గతంగా
తనలో దాగున్న
మంచితనం
పంచుకుంటే
మనిషితనం పెరుగుతుందనే
జీవన సూత్రాన్ని
నేర్చుకోవాలి….!!


నలిగల రాధికా రత్న.

You may also like...