కరువు కాటుకు రైతులు విలవిల..

జ్ఞాన తెలంగాణ వెబ్ డెస్క్ (నవంబర్ 2):

రాష్ట్రంలో కరువు పరిస్థితులతో రైతులు విలవిల్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనీసం చలనం లేదని మండిపడ్డారు. కరువు మండలాలుగా ప్రకటించడంతోనే ప్రభుత్వ బాధ్యత ముగిసిపోయిందా? రైతులకు ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. సోమవారం వనపర్తి జిల్లాలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు మండలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలను ఏ విధంగా ఆదుకుంటారో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదని ఆరోపించారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో కరువు పరిస్థితులను గుర్తించి ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం రైతులకు నయాపైసా పరిహారం అందించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. మియాపూర్‌లోని 500 ఎకరాల భూములను విక్రయించి కమిషన్లు సంపాదించాలనే ధ్యాస తప్ప, కష్టాల్లో ఉన్న రైతులను ఎలా ఆదుకోవాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి కనిపించడం లేదని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు తీవ్రతరమై తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, పశువులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలపై స్పష్టత ఇవ్వడం లేదని మండిపడ్డారు. కరోనా సంక్షోభ సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. రేషన్‌ కార్డుదారుల ఖాతాల్లో రూ.1,500 జమ చేయడంతో పాటు ఒక్కొక్కరికి 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసి పేద కుటుంబాలకు భరోసా కల్పించిందని తెలిపారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను గాలికొదిలేసి ప్రకటనలకే పరిమితమైతే ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం మరింత పెరుగుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు.

You may also like...