హైదరాబాద్ సీపీగా ఇక సెలవు!
- గిగ్ వర్కర్ల ర్యాలీకి రాహుల్ గాంధీ - November 12, 2026
- అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపులు! - November 12, 2026
- ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.1.50 కోట్ల విరాళం! - November 12, 2026

హైదరాబాద్ :
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా గడిచిన ఏడాది కాలం తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అపురూపమైన ప్రయాణమని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సందర్భంగా ఆయన భావోద్వేగపూరిత సందేశాన్ని విడుదల చేశారు. చారిత్రక హైదరాబాద్ నగరానికి పోలీస్ కమిషనర్‌గా సేవలందించే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ భగవత్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
నగర ప్రజలు తనపై, పోలీస్ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని సజ్జనార్ పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్‌లో ప్రజలంతా శాంతియుతంగా పండుగలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఆహార కల్తీని అరికట్టేందుకు ‘హెచ్-ఫాస్ట్’ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకులు, కేంద్ర టెలికాం శాఖ సమన్వయంతో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ ప్రారంభించామని, ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రశంసలు లభించాయని వెల్లడించారు.
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పోలీసుల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించేందుకు ‘డే విత్ సీపీ’ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం, మహిళల భద్రత కోసం ‘స్పందన’ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
పోలీసు సిబ్బంది ప్రతిభను ప్రోత్సహించేందుకు ‘ఎక్స్‌ట్రా మైల్’, ఆరోగ్య పరిరక్షణకు ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. హోంగార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ, డీజీపీ, ఇతర అధికారులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రజలు ఎల్లప్పుడూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ‘గుండెనిండా మధుర జ్ఞాపకాలతో హైదరాబాద్ సీపీగా ఇక సెలవు’ అంటూ సజ్జనార్ తన సందేశాన్ని ముగించారు.
