నవంబర్ 6న కామారెడ్డిలో శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు

కామారెడ్డి: ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ శుక్రవారం శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల వివరాలను వెల్లడించారు. గత 33 సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లాలో కీర్తిశేషులు పోలీస్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ఆశ్వయుజ బహుళ త్రయోదశి సందర్భంగా నవంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శ్రీ ధన్వంతరి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆరోగ్య అధికారి, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ముఖ్య అతిథులుగా హాజరుకానుండగా, కామారెడ్డి టౌన్ సీఐ, ఎస్ఐలు కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం హాజరైన వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ మానేటి, జిల్లా సంఘ కార్యదర్శి లింగంపల్లి దేవయ్య, అధికార ప్రతినిధి సీహెచ్ రాజయ్య, కామారెడ్డి టౌన్ ఇన్‌చార్జి ఎం.బి. ప్రకాష్, శ్రీనివాస్, పాండురంగం, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...