ఎమ్మార్పీఎస్‌లో నాయకత్వ లోపం.. స్వలాభాల కోసమే సంఘాన్ని వాడుకుంటున్నారు!

ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) పేరుతో జిల్లాలో ఎన్ని అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి? వాటి నాయకులు మాదిగ సమాజ అభ్యున్నతి కోసం ఏం చేస్తున్నారు? అంటూ కామారెడ్డి జిల్లా మాదిగ మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు సట్టిగారి బుజ్జమ్మ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 మందకృష్ణ మాదిగ నాయకత్వంపై నమ్మకంతో, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్‌లో చేరానని బుజ్జమ్మ తెలిపారు. అయితే కామారెడ్డి జిల్లాలో సరైన నాయకత్వం లేకపోవడం, మందకృష్ణ మాదిగ ఆశయాలకు అనుగుణంగా సంఘం పనిచేయకపోవడం బాధ కలిగిస్తోందన్నారు.

జిల్లాలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలకు చెందిన కొందరు నాయకులు తాము సీనియర్ నాయకులమని, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులమని చెప్పుకోవడానికే పరిమితమవుతున్నారని విమర్శించారు. మాదిగ సమాజ సంక్షేమం, హక్కుల సాధన కోసం పనిచేయాల్సిన వారు వ్యక్తిగత స్వలాభాలకే ప్రాధాన్యత ఇస్తూ, వసూళ్లకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకత్వం జిల్లాలో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ సమాజ శ్రేయస్సు కోసం నిజాయితీగా పనిచేసే నాయకులకు సరైన గుర్తింపు, ప్రాధాన్యత లేకుండా పోతోందన్నారు. కామారెడ్డి జిల్లాలో ఎమ్మార్పీఎస్‌కు గతంలో ఉన్న విలువ, ప్రాధాన్యత తగ్గిపోయాయని, జిల్లా ఇన్‌చార్జి ఎవరో, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. జిల్లాలో ఎవరు వచ్చినా తామే నాయకులమని చెప్పుకుంటూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంఘాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే కామారెడ్డి జిల్లాలో ఎమ్మార్పీఎస్‌కు మళ్లీ పూర్వ వైభవం రావడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎమ్మార్పీఎస్‌లో తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, జిల్లా ఉపాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సట్టిగారి బుజ్జమ్మ స్పష్టం చేశారు.

You may also like...