ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.30 వేల పరిహారం చెల్లించాలి సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ డిమాండ్
- ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడల నిర్వహణకు కీలక నిర్ణయాలు - November 4, 2026
- కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతంపై కఠిన చర్యలు తీసుకోవాలి. - November 4, 2026
- నవంబర్ 6న కామారెడ్డిలో శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు - November 4, 2026
కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని, నీరు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
మంగళవారం పాల్వంచ, మాచారెడ్డి మండల కేంద్రాల్లో పర్యటించిన ఆమె ఎండిపోయిన పంటలను పరిశీలించి, బాధిత రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అప్పులు చేసి ఎరువులు, విత్తనాలు, ఇతర పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారని, వర్షాభావం, నీటి కొరత కారణంగా వరి, కూరగాయలు తదితర పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. డ్వాక్రా సంఘాలు, ఇతర మార్గాల ద్వారా అప్పులు తెచ్చిన రైతులు వాటిని తిరిగి చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల అవసరాలు, అప్పుల పరిస్థితులను ఆసరాగా చేసుకుని మధ్య దళారులు తక్కువ ధరలకు పంటలు కొనుగోలు చేసి నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, రైతులను దోచుకునే వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.30 వేల పరిహారం అందించాలని, రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 11వ తేదీన కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని పశ్య పద్మ హెచ్చరించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, జిల్లా నాయకులు ఎం. దేవయ్య, రాజ్యం, సత్యం, సుమన్, ఎల్లవ్వ, రమేష్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
