రేవంత్‌ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు విఫలం: కేసీఆర్‌ ఇంటి ముట్టడికి పోలీసులే రూట్‌మ్యాప్‌ ఇవ్వడం దారుణం.. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

1000339523.jpgముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇంటిని ముట్టడించి చావు డప్పు కొడతామని కొందరు ప్రకటిస్తే.. పోలీసు యంత్రాంగం వారికి రూట్‌మ్యాప్‌ ఇచ్చి తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మీడియా పెద్దగా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ రాజకీయ బిక్ష పెట్టిన వేముల వీరేశం తో పాటు ఎమ్మెల్యేలు బిర్ల ఐలయ్య, అనిల్ రెడ్డి మరికొంతమంది రౌడీ మూకలను వేలాదిమందిగా కేసీఆర్, కేటీఆర్ ఇళ్లకు పంపి చావు డప్పు కొడతాం అని హత్యాయత్నాలకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం, డీజీపీ ఆదేశాలతో వీరికి రూట్ మ్యాప్‌లు ఇచ్చి రక్షణగా తీసుకెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ​రాష్ట్రంలో 75 వేల నుంచి 80 వేల మంది పోలీసులు ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ గారు పిలుపునిస్తే రెండు కోట్ల మంది బీఆర్ఎస్ సైనికులు రోడ్డు మీదకు వస్తారు. 'రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించాలి' అని మేము అనుకుంటే నీ పోలీసులు నిన్ను కాపాడగలరా? అని చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. ఇలాంటి ఘర్షణాత్మక రాజకీయాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని సూచించారు. మహిళలపై దాడి జరిగిన ఘటనలను కూడా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్ని ఘటనలను సమానంగా ఖండించాలని కోరారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు దాడులకు పాల్పడటం సరికాదన్నారు. రైతులు, విద్యార్థులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.‌కేసీఆర్‌ హయాంలో దళిత బంధు వంటి పథకాల ద్వారా పేదలకు ప్రయోజనం కల్పించామని, ప్రస్తుత ప్రభుత్వం దళితులు, పేదలు, రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ విధానాలను సమీక్షించుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. కేసీఆర్‌ ఇంటి ముట్టడి, మహిళలపై దాడుల ఘటనలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఘటనలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.

You may also like...