కారు బీభత్సం: కాలీమందిర్ వద్ద ఆర్టీసీ కండక్టర్‌కు తీవ్ర గాయాలు, పలు వాహనాలు ధ్వంసం

372355.jpg

బండ్లగూడ జాగీర్: బండ్లగూడ కాలీమందిర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమిత వేగంతో దూసుకొచ్చిన ఒక క్యాబ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్‌ను బలంగా ఢీకొట్టి, ఆపై అక్కడ నిలిపి ఉంచిన ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ రోజు ఉదయం సుమారు 6:00 గంటల సమయంలో ఆర్టీసీ కండక్టర్ రాజిత కాలీమందిర్ టెంపుల్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో TS 04 UE 4673 నంబర్ గల ఓ క్యాబ్ విపరీతమైన వేగంతో వచ్చి ఆమెను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా, అక్కడే పార్కింగ్ చేసి ఉన్న మరో రెండు కార్లను, ఒక ద్విచక్ర వాహనాన్ని (బైక్) సదరు క్యాబ్ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వాహనాలు భారీగా డ్యామేజ్ అయ్యాయి. అయితే, పార్క్ చేసి ఉన్న కార్లలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రాణనష్టం తప్పిందని చెప్పవచ్చు. కండక్టర్ రాజితకు తీవ్ర గాయాలవడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్యాబ్ డ్రైవర్ అంజనేయులు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించి, క్యాబ్ డ్రైవర్ అంజనేయులుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.372384.jpg

372402.jpg

You may also like...