క్రాకర్ల విక్రయాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!


జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయాలు, వినియోగంపై విధించిన ఆంక్షలు అమలు కాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉన్నప్పటికీ ఢిల్లీ మార్కెట్లలో అన్ని రకాల క్రాకర్లు యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే విక్రేతలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. లైసెన్స్‌ ఉన్నా లేకపోయినా, క్యూఆర్‌ కోడ్‌ ఉన్నా లేకపోయినా మార్కెట్లలో క్రాకర్ల విక్రయాలు జరుగుతున్నట్లు హిందుస్థాన్‌ టైమ్స్‌ కథనాన్ని ప్రస్తావించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నవంబర్‌ 7, 8 తేదీల్లో మాత్రమే గ్రీన్‌ క్రాకర్స్‌ వినియోగానికి అనుమతి ఉంది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలి. నవంబర్‌ 9 నుంచి ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో సంపూర్ణ నిషేధం తిరిగి అమల్లోకి వస్తుంది. ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాల చుట్టూ 300 మీటర్ల పరిధిలో క్రాకర్లు కాల్చరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ప్రాంతాలను నో క్రాకర్‌ జోన్లుగా గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం సహించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

You may also like...